
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం(War)తో పశ్చిమ దేశాలు(Western Countries), రష్యా(Russia)కు మధ్య దూరం మరింత పెరిగింది. ఉక్రెయిన్, బెలారస్ సమీపంలో రష్యా బలగాల మోహరింపులు మొదలైనప్పటి నుంచి ఇక్కడి పరిస్థితులపై అంతర్జాతీయంగా చర్చ జరిగింది. రష్యా పేర్కొన్న డిమాండ్లు నెరవేరకపోవడంతో దాడి ప్రకటించింది. ఈ యుద్ధంపై అంతర్జాతీయంగా కదలికలు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు కొన్ని రోజులుగా ఈ యుద్ధం గురించి చర్చల్లో మునిగాయి. ఎలా వ్యవహరించాలి? ఏం చేయాలి? రష్యాను ఎలా నిలువరించాలి? వంటి అనేక అంశాలపై చర్చలు జరిపాయి. రష్యా దాడి చేసిన తర్వాత కూడా ఆ దేశంపై ఇవి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాయి. యూకే అయితే.. పుతిన్‌ను ఏకంగా డిక్టేటర్ అనేసింది. ఇదిలా ఉండగా.. చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు మాత్రం రష్యాకు వ్యతిరేకంగా కాదు కదా.. రష్యాకు కొంత అనుకూలంగానే మాట్లాడాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఎలా ఉండాలి? దాని ముందున్న సవాళ్లు ఏమిటి? అనే విషయాలను చర్చిద్దాం.
ఈ యుద్ధంపై భారత్ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సమీపంలో రష్యా బలగాలు మోహరించినప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం బ్యాలెన్స్‌డ్ పొజిషన్‌నే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ భారత్ ఎక్కడా గీత దాటలేదు. అన్ని పక్షాలు సంయమనం వహించి దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ప్రకటనను సాదాసీదాగా ఉన్నదని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. రష్యా బలగాల మోహరింపును ఒక వైపు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూనే చర్చలకు రావాల్సిందిగా రష్యాను పశ్చిమ దేశాలు పదే పదే కోరడం గమనార్హం.
పశ్చిమ దేశాలే కాదు.. రష్యా కూడా చర్చలకు సిద్ధంగానే ఉన్నట్టు పేర్కొంది. తాము కూడా దౌత్యమార్గంలోనే సమస్య పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు రష్యా కూడా వెల్లడించింది. కానీ, పశ్చిమ దేశాలు తాము చెబుతున్న సెక్యూరిటీ డిమాండ్లను ఖాతరు చేయడం లేదని తెలిపింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సమీపంలో ఉన్నా.. బెలారస్‌లో ఆ దేశ ఆహ్వానంపై మిలిటరీ చర్యలు చేపడుతున్నా.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరగలేదు. కానీ, ఇప్పుడు వేరే పరిస్థితి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరిపింది. యుద్ధాన్నే ప్రకటించి క్షిపణులతో దాడి చేసింది. కాబట్టి, పశ్చిమ దేశాలు సహా మరికొన్ని దేశాలు రష్యాను తీవ్రంగా ఖండించాయి. ఇదే తీరులో భారత్ కూడా రష్యా చర్యలను తీవ్రంగా ఖండించాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. రష్యా ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. ఆ దేశాన్ని ఖండించడంలో తప్పులేదు. ఇప్పుడు ఇదే భారత్ ముందు ఒక సవాల్‌ను నిలిపింది.
ఇలాంటి స్థితి గతంలోనూ భారత్‌కు ఎదురైంది. 2014లో రష్యా ప్రాక్టికల్‌గా క్రిమియాను ఆక్రమించింది. అక్కడ రెఫరెండం నిర్వహించి ప్రజలు రష్యా వైపు ఉండాలని కోరుకుంటున్నారని చెప్పి తనలో కలుపుకుంది. ఈ విధానాన్ని భారత్ అంగీకరించదు. కానీ, అప్పుడు కూడా భారత్ బహిరంగంగా రష్యాను విమర్శించకున్నా.. అధ్యక్షుడు పుతిన్‌తో టెలి ఫోన్ సంభాషణలో భారత ప్రధాని తప్పుపట్టారు. ఇప్పుడు కూడా ఇలాంటి దారి ఎంచుకోవడమే ఉత్తమం.
ఎందుకంటే రష్యాతో మనకు ఉన్న సంబంధం ముఖ్యమైనది. రష్యా నుంచి రక్షణ సహకారం భారత్‌కు ఎంతో కీలకమైనది. అంతేకాదు, రష్యాతో సత్సంబంధాలతో ఇరాన్, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్‌లతోనూ భారత్ మంచి సంబంధాలను నెరపగలుగుతున్నది. కాబట్టి, రష్యా చర్యలపై కఠిన ప్రకటనలు చేసి ఈ కీలక సంబంధాలను జటిలం చేసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విధానాన్ని అవలంభించడంలో తప్పేమీ లేదు. అంతర్జాతీయ దౌత్యానికి చాలా దేశాలు ఇలాంటి వైఖరులను అవలంభించడం కద్దు.
ఉక్రెయిన్‌పై దాడితో పశ్చిమ దేశాలు.. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు. వాటికి కౌంటర్‌గా రష్యా కూడా ఆంక్షలకు దిగవచ్చు. తద్వారా ఆయిల్, గ్యాస్ ధరలు, సరుకులు, ముడి సరుకుల ధరలు పెరగవచ్చు. ఇవి రష్యా ఎగుమతుల్లో కీలకంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, రష్యాతో అమెరికా చర్చలు జరిపి ఇతర దేశాల్లో ఘర్షణలను తగ్గించుకుని సొంత దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోవాలని అమెరికా భావించింది. కానీ, రష్యా దాడులతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఈ దాడి చైనాకు కలిసి రావొచ్చు. ఎందుకంటే.. ఈ యుద్ధం కారణంగా చైనాపై రష్యా మరింత ఎక్కువగా ఆధారపడవచ్చు. దీన్ని చైనా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇది ఎంతో కొంత భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. కాబట్టి.. ప్రయోజనం చేకూర్చని, నష్టపరిచే ప్రకటనలు చేయకపోవడమే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.