
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని తేల్చిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 4 వేల మంది వరకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ప్రకటించింది. దాదాపు 16 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కున్నారు. వారిని స్వదేశానికి తిరిగి తీసుకరావడానికి భారత ప్రభుత్వం రెండు విమానాలను పంపించబోతుంది.
శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత ప్రభుత్వం పంపిస్తోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు AI 1941 టేకాఫ్ అవుతుందని, అలాగే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సాయంత్రం 4 గంటలకు AI 1943 విమానం బయలుదేరుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలు రొమేనియాలో ల్యాండ్ అవబోతున్నాయి. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకరానున్నారు.
ఈ సమయంలోగా.. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. ఈ రెండు విమానాల ద్వారా సుమారు 500 మంది ప్రయాణికులు భారత్ కు చేరుకునే అవకాశముందని అధికారులు తెలుతున్నారు. 256 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన డ్రీమ్‌లైనర్ విమానాలను మోహరించనున్నట్లు భారత అధికారులు తెలిపారు. అక్కడి అధికారులతో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ రెండు విమానాలు రొమేనియా కు చేరుకోవడానికి దాదాపు ఏడు గంటల 45 నిమిషాల సమయం పడుతుందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. వారు శనివారం ఉదయం తిరిగి ల్యాండ్ అవుతారని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకవస్తున్న విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ట్విట్టర్ వేదిక తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రొమేనియా ద్వారా తిరిగి తీసుకురావాలని భారతదేశం నిర్ణయం తీసుకుంది. రొమేనియా విదేశాంగ మంత్రి బొగ్డాన్ ఆరెస్క్యూ తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారతీయులను తరలింపు విషయంలో యూరోపియన్ దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఆరెస్క్యూకి ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశారు. ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి స్లోవేకియా, హంగేరీ దేశాలు భారతదేశం కూడా మద్దతునిచ్చినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్ - రష్యా ఉద్రిక్తత నేపధ్యంతో సివిలియన్ విమానాల రాకపోకలపై ఉక్రెయిన్ నిషేధం విధించింది. దీంతో చాలా మంది భారతీయులు ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నారు. భారత పౌరులు సురక్షితంగా రావాలంటే బుకారెస్ట్ గుండా రావలసి ఉంటుంది.