ప్రధానమంత్రి మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు సమావేశం.. వీటిపైనే చర్చ..!

By telugu teamFirst Published Nov 23, 2021, 7:06 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆమె బీఎస్ఎఫ్ పరిధి పెంపు, బెంగాల్‌కు కేంద్రం నిధుల కేటాయింపులపై మాట్లాడే అవకాశం ఉన్నది. వీటితోపాటు ప్రస్తుతం త్రిపురలో కాక మీదకు వచ్చిన రాజకీయ హింస అంశాన్నీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25 వరకు ఆమె ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీ చేరి ప్రతిపక్ష పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
 

న్యూఢిల్లీ: West Bengal ముఖ్యమంత్రి Mamata Banerjee ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె రేపు ప్రధాన మంత్రి Narendra Modiతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) పరిధి పెంపు, పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధుల కేటాయింపులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. వీటితోపాటు త్రిపురలో రాజకీయ హింస అంశాన్నీ ప్రస్తావించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీలో పర్యటిస్తుండటం గమనార్హం. ఈ నెల 29 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 25వ తేదీ వరకు CM మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత ఆమె తిరిగి పశ్చిమ బెంగాల్‌కు చేరనున్నారు. అయితే, పార్లమెంటు సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీ పర్యటించడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో ఆమె విపక్ష పార్టీల నేతలనూ కలుస్తున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆమె వ్యూహ ప్రతివ్యూహాలు రచించనున్నారు.

Also Read: ఢిల్లీకి మమతా బెనర్జీ.. పార్లమెంటు సమావేశాలపై విపక్షాలతో కార్యచరణకు వ్యూహం!.. ప్రధానితోనూ భేటీ

ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది అఖండ మెజార్టీతో గెలిచిన టీఎంసీ ఇతర రాష్ట్రాలకూ విస్తరించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోవా, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రచారాలను చేస్తున్నది. కాగా, తాజాగా బిహార్‌లోనూ తన అడుగు పటిష్టం చేసుకునే పరిణామం జరిగింది. బిహార్‌లో ఇద్దరు కీలక నేతలు మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు బిహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్‌కు రాజకీయ సలహాదారుడిగా ఉన్న జేడీయూ బహిష్కృత నేత పవన్ వర్మ టీఎంసీలో చేరారు. కాగా, బిహార్‌లోని దర్బంగా నుంచి మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన కీర్తి ఆజాద్ కూడా మమతా బెనర్జీ పార్టీ కండువా కప్పుకున్నారు.

దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ బలమైన శక్తి అని పవన్ వర్మ ఈ సందర్భంగా పార్టీ చీఫ్‌పై ప్రశంసలు కురిపించారు. బీజేపీ సహా అన్ని పార్టీల నుంచి నేతలు టీఎంసీలో చేరడం ఖాయమని తెలిపారు. వాస్తవ క్షేత్రంలో ఉండి పోరాడే నాయకులు ఇప్పుడు దేశానికి అవసరమని కీర్తి ఆజాద్ అన్నారు. ఆ పోరాటంలో విజేతగా నిరూపించుకున్న మమతా బెనర్జీ సరైన నాయకురాలు అని పొగిడారు.

Also Read: Bypoll Results 2021: బెంగాల్‌లో బీజేపీకి దెబ్బ.. మూడు చోట్ల డిపాజిట్లు గల్లంతు.. టీఎంసీ క్లీన్‌స్వీప్

 ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరనున్నాయి. ముఖ్యంగా మూడు సాగు చట్టాల రద్దు అంశం ప్రధానంగా ముందుకు రానుంది. అయితే, ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఇంకా చర్చలు జరుగలేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆమె ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం అవుతారని ఇటీవలే కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరపనున్నట్టు వివరించాయి.

అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో బీఎస్ఎఫ్ పరిధిని పెంచడంపై పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ సమాఖ్యస్ఫూర్తికి భంగం కలిగిస్తూ రాష్ట్రాల హక్కులను హరించే యత్నం చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఈ చర్యను నిరసిస్తూ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.

click me!