
న్యూఢిల్లీ: పాకిస్తాన్ యూట్యూబర్ సనా అంజద్ పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతున్నది. అందులో అక్కడి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ యువకుడు ఫన్నీగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ ప్రధానిగా మోడీనే కావాలని, తమకు మరెవరూ అక్కర్లేదని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇక్కడి ముస్లింల కన్నా.. భారత్‌లో ఉన్న ముస్లింలు హాయిగా జీవిస్తున్నారని అన్నారు. అక్కడ చికెన్, టమాట, పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మనం ఇక్కడ వాటిని ఎక్కువ ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు.
ఒకప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు పాకిస్తాన్ సే జిందా బాగో.. చాహే ఇండియా చలే జావో(పాకిస్తాన్ నుంచి పారిపోండి.. అవసరమైతే ఇండియాకు వెళ్లిపోండి) అనే నినాదం ఎందుకు వినిపిస్తున్నదని యూట్యూబర్ ఓ యువకుడిని ప్రశ్నించారు. ఇందుకు ఆ స్థానికుడు సమాధానం ఇస్తూ.. ఇదే వాస్తవం అని, తాను కూడా అదే అంటానని వివరించారు.
‘అసలు పాకిస్తాన్ ఇండియా నుంచి వేరు కాకుంటే బాగుండేది. అప్పుడు మనం కూడా రూ. 20కే కిలో టమాట, రూ. 150కే కిలో చికెన్, రూ. 50కే లీటర్ పెట్రోల్ కొనుగోలు చేసేవాళ్లం’ అని వివరించారు. ‘మనం ఒక ఇస్లామిస్ట్ దేశాన్ని పొందినా.. ఇస్లాంను మాత్రం స్థాపించలేకపోవడం దురదృష్టకరం’ అని తెలిపారు.
పాకిస్తాన్‌లో కంటే ఇండియా లో పరిస్థితులు బాగున్నాయని, అందుకే తమ కు కూడా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రావాలని, ఆయన పాలనలో ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని ఆ స్థానికుడు భావించాడు. తమకు నవాజ్ షరీఫ్ అవసరం లేదు.. ఇమ్రాన్ అక్కర్లేదు.. బెనజీర్ కూడా వద్దు.. జనరల్ ముషార్రఫ్ కూడా అవసరం లేదని అన్నారు. కేవలం మోడీనే కావాలని ప్రార్థిస్తున్నానని, అతను మంచి వ్యక్తి అని వివరించారు. తాను మోడీ పాలనలో జీవించడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.