
శ్రీ మాతా వైష్ణో దేవి దేవాలయ మార్గంలో మంగళవారం కొండచరియలు విరిగిన సంఘటనలో 32 మంది యాత్రికులు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కట్రా నుంచి ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల ఎత్తైన మార్గంలో సగం దారిలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. రాళ్లు, బండరాళ్లు యాత్రికులపై పడటంతో అక్కడిక్కడే మరణించారు.
అధిక వర్షాల కారణంగా కొండచరియలు కూలిపోవడంతో యాత్రికులు చిక్కుకుపోయారు. అద్ఖ్వారీ సమీపంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రక్షణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. మంగళవారం రాత్రి వరకు 30 మంది మృతి చెందినట్టు సమాచారం అందగా, బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 32కి పెరిగింది.
జమ్మూ ప్రాంతంలోని అన్ని నదులు, అలాగే కశ్మీర్‌లోని జెలమ్ నది నీటిమట్టం పెరిగి ఎర్ర మట్టానికి మించి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో యాత్ర మార్గాల్లో అప్రమత్తత మరింత పెంచారు. వైష్ణో దేవి ఆలయానికి రెండు మార్గాలు ఉండగా. హిమ్కోటి మార్గాన్ని మంగళవారం ఉదయం నుంచే మూసివేశారు. పాత మార్గంలో మాత్రం మధ్యాహ్నం 1.30 వరకు యాత్ర కొనసాగింది. కానీ వర్షాలు మరింతగా కురవడంతో చివరకు ఆ మార్గాన్ని కూడా మూసివేసి యాత్ర పూర్తిగా నిలిపివేశారు.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయ మార్గంలో సంభవించిన ప్రమాదంలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పట్ల హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.