ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్య దేశం హోదా ఉండాల్సిందే: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

By telugu teamFirst Published Sep 25, 2021, 3:14 PM IST
Highlights

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్య దేశ హోదా ఉండాల్సిందేనని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ సమయంలో భారత్ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన కొనియాడినట్టు వివరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జో బైడెన్ భేటీ అయిన సంగతి తెలిసింది. ఈ భేటీ అనంతరం జో బైడెన్ మీడియాతో మాట్లాడారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసుకున్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలంగా వాదించారు. ఏళ్ల తరబడి భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశ హోదా ఉండాలనే డిమాండ్ ఉన్నది. కానీ, మనకు గిట్టను చైనా వంటి దేశాలు ఈ డిమాండ్‌ను పక్కపెడుతూ వస్తున్నాయి. భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదాను వీటో పవర్‌తో తోసిపుచ్చుతున్నాయి. కానీ, తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా భారత్‌కు మద్దతు ఇచ్చినట్టు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా అన్నారు. భారత్‌కు శాశ్వత సభ్య దేశ హోదా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్టు వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న సమయంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, సమన్వయంతో మెదిలిందని జో బైడెన్ ప్రశంసించారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభకాలంలో సమర్థంగా పనిచేసిందని కితాబిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన ప్రత్యక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భద్రతా మండలిలో శాశ్వత హోదాతోపాటు, భారత ఐటీ నిపుణులకు కీలకమైన హెచ్1-బీ వీసా, విద్యార్థి వీసాల గురించి మాట్లాడినట్టు తెలిసింది. వీరిరువురి భేటీ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు.

ఐరాస వ్యవస్థాపక సభ్య దేశంగా ఉన్న భారత్‌కు ఇప్పటి వరకు శాశ్వత సభ్య దేశ హోదా లభించలేదు. భద్రతా మండలిలో తాత్కాలిక హోదాపై భారత్ ఏడు సార్లు ఎన్నికైంది. 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలి కీలకమైంది. ఇందులో ఐదు శాశ్వత దేశాలు(అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే), మరో పది తాత్కాలిక హోదా దేశాలుంటాయి. తాత్కాలిక హోదాపై రెండేళ్లకు గాను వివిధ దేశాలు ఎన్నికై భద్రతా మండలికి వస్తాయి. ప్రస్తుతం భారత తాత్కాలిక హోదాపై భద్రతా మండలిలో ఉన్నది.

click me!