ఆందోళన జరుగుతుంటే చూడటానికి వెళ్లిన బాలుడు.. పోలీసుల కాల్పుల్లో మృతి..

By telugu teamFirst Published Sep 25, 2021, 12:59 PM IST
Highlights

అసోంలో దర్రాంగ్ జిల్లాలో ప్రభుత్వ భూముల నుంచి స్థానికులను తరలించే ప్రక్రియ హింసాత్మకంగా మారింది. ఇదే వారంలో అక్కడ పోలీసులకు, స్థానికులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మరణించారు. మరణించిన ఇద్దరిలో ఓ 12ఏళ్ల బాలుడూ ఉన్నాడు. ఆ ఆందోళనలతో సంబంధమే లేని ఆ బాలుడు పోస్ట్ ఆఫీసు నుంచి ఆధార్ కార్డు తెచ్చుకుంటూ నిరసనలు చూడటానికి పక్కన నిలుచున్నాడు. ఘర్షణలు ఉద్రిక్తం కావడంతో పోలీసుల తూటాకు బలయ్యాడు.

గువహతి: అసోంలో హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. ఆందోళనకారులపై పోలీసులు దారుణంగా దాడి చేస్తున్న వీడియోలు సంచలనమయ్యాయి. అసోంలో దర్రాంగ్ జిల్లాలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం జరుగుతున్నది. కాగా, ఆ భూముల్లో నివసిస్తున్న స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. తాము నివసిస్తున్న భూములను వదిలేది లేదంటూ ధర్నాలు చేస్తుండగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ స్థానికులు కర్రలు విసిరారు. దీంతో పోలీసులూ ఆందోళనకారులను దారుణంగా అణచివేయడానికి ప్రయత్నించారు. లాఠీ చార్జ్ చేయడంతో పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. అసలు ఈ ఆందోళనలతో సంబంధమే లేని ఓ 12 ఏళ్ల బాలుడు కూడా చనిపోయాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఆధార్ కార్డు తెచ్చుకుంటూ ప్రజలంతా గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లి పక్కకు నిలుచుండి ఆందోళనలను చూస్తున్నాడు. కానీ, పరిస్థితులు ఉద్రిక్తం కావడంతో పోలీసులు నేరుగా ఆయన చాతిలో కాల్పులు జరిపినట్టు సమాచారం.

ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిందిగా జూలై నుంచి పోస్ట్ ఆఫీసు నుంచి పిలుపులు వచ్చాయి. కానీ, నిర్లక్ష్యం చేసిన ఆ కుటుంబం మొన్ననే 12ఏళ్ల బాలుడు షాక్ ఫరీద్‌ను పోస్ట్ ఆఫీసుకు పంపింది. ఆయన సమీపంలోని పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఆధార్ కార్డు పట్టుకుని వస్తుండగా ఆందోళనలు గమనించాడు. ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్లి పక్కనే ఉండి గమనిస్తూ నిలుచున్నాడు. ఇంతలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడటమే కాకుండా కాల్పులూ జరిపారు. ఓ పోలీసు అధికారి ఫరీద్‌కు ఎదురుగా వచ్చి ఆయన చాతిలో బుల్లెట్ దింపినట్టు ఫరీద్ బంధువు ఒకరు చెప్పారు. బుల్లెట్ దిగగానే స్పాట్‌లోనే ఫరీద్ మరణించాడని వివరించారు. మరో వ్యక్తి మోయినుల్ హక్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ జిల్లాలో ఓ సాగు ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం ప్రజలు నివసిస్తున్న ప్రభుత్వ భూములను తిరిగి సేకరించాలనుకుంటున్నది. ఇందులో భాగంగా సోమవారం ధోల్‌పుర్ నుంచి కనీసం 800 మంది కుటుంబీకులను తరలించింది. ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,500 బిగాల భూమిని తిరిగి రాబట్టుకోవాలని భావిస్తున్నది. కానీ, ఈ చర్యను నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఫరీద్ కుటుంబానికి ఇంకా తరలింపునకు సంబంధించిన నోటీసు కూడా రాలేదు. కేవలం ఆందోళనలను చూడటానికి వెళ్లే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

click me!