యోగి సర్కార్ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తోంది. డిసెంబర్ 30 లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళాలో డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. దీంతో అధికారులు ఆ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షలకు అనుగుణంగా డిజిటల్, పరిశుభ్ర మహా కుంభమేళాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాగరాజ్ నగరంతో పాటు కుంభమేళా ప్రాంతాల్లో డిజిటల్ సైనేజ్‌లు ఏర్పాటు చేయాలని... పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతిచోటా డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని... పారిశుధ్య సిబ్బంది, చెత్త సేకరణ వాహనాల మధ్య సమన్వయం ఉండాలని సీఎస్ సూచించారు. .
ప్రయాగరాజ్ మేళా ప్రాధికారణ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... వర్షాలు కురుస్తుండటంతో ఆటంకాలు ఏర్పడుతున్నా వాటిని దాటుకుంటూ మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని... డిసెంబర్ 30 లోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విమానాశ్రయంలో రాత్రి సమయాల్లో విమానాల ల్యాండింగ్ సమస్యను కేంద్రంతో చర్చిస్తామని, మేళా ప్రారంభానికి ముందే పరిష్కరిస్తామని అన్నారు. కుంభమేళా సమయంలో మరిన్ని విమాన సర్వీసులు నడపడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గత కుంభమేళాలతో పోలిస్తే ఈసారి పారిశుధ్యంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. టెక్నాలజీ సాయంతో పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తామని అన్నారు. మూత్రశాలల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని... ఘన వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది, చెత్త సేకరణ వాహనాల మధ్య సమన్వయం ఉండాలని, ప్రత్యేక పారిశుధ్య బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎక్కడా మురుగు కాలువలు తెరిచి ఉండకూడదని, మురుగునీరు నదిలో కలవకూడదని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించాలని, డస్ట్‌బిన్‌లు నిండకుండా చూసుకోవాలన్నారు. కమ్యూనిటీ టాయిలెట్ల వద్ద ఎవరూ టేబుళ్లు పెట్టుకోకూడదని... ప్రవేశ ద్వారాలు ఖాళీగా ఉంచాలన్పారు. పారిశుధ్య సిబ్బందికి కుంభమేళా ప్రాంతంలోనే భోజన వసతి కల్పించాలని ఆదేశించారు.
ప్లాస్టిక్ రహిత కుంభమేళాను ప్రోత్సహించాలని... దోనెలు, పత్రాలు, జ్యూట్ సంచులను సబ్సిడీ ధరలకు అందించాలన్నారు. చేతితో దోనెలు, పత్రాలు తయారు చేసేవారికి స్టాళ్లు ఇప్పించాలన్నారు. ఓవర్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలపై ప్రముఖ కళాకారులతో చిత్రలేఖనం చేయించాలని చీఫ్ సెక్రటరి సూచించారు.
భూమి కేటాయింపులో వివాదాలు రాకూడదని, మేళాధికారి అందరితో చర్చించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. టెంట్ సిటీల్లో కొత్త వస్తువులే ఉండాలని, డిజిటల్ కుంభాన్ని ప్రోత్సహించాలని, యాప్‌లు వాడని వారి కోసం డిజిటల్, బహుభాషా సైనేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఉద్యానవనాల పనులు వేగవంతం చేయాలన్నారు. రోడ్ల నాణ్యతను థర్డ్ పార్టీతో తనిఖీ చేయించాలని, రోడ్డు పనులతో పాటు మురుగునీటి పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు.
మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ 10 ప్రతిపాదనలు సమర్పించగా... వాటికి ఆమోదం లభించింది. వీటిలో లోక్ నిర్మాణ్ విభాగం, సీఅండ్‌డీఎస్ విభాగాలకు చెందిన రెండు ప్రతిపాదనలు, నగరపాలక సంస్థ, మేళా ప్రాధికారణ, పర్యాటక శాఖ, జలనిగమ్, సమాచార శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన ఒక్కో ప్రతిపాదన ఉన్నాయి. వీటిలో కుంభ్ కాన్‌క్లేవ్ కోసం ₹2.35 కోట్లు, ప్రీమియం టెంట్ల కోసం ₹3.51 కోట్లు, దారాగంజ్ నుంచి దశాశ్వమేధ్ ఘాట్ వరకు లైటింగ్ కోసం ₹1.83 కోట్లు, పెయింట్ మైసిటీ కోసం ₹5 లక్షలు, సర్క్యూట్ హౌస్ ఫర్నీచర్ కోసం ₹3.92 కోట్లు, సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ₹2.41 కోట్లు, డిజిటల్ సైనేజ్ కోసం ₹10 కోట్లు, వెండింగ్ జోన్ రోడ్డు అభివృద్ధి కోసం ₹3.24 కోట్లు, ఐసీసీసీ పునరుద్ధరణ కోసం ₹50 లక్షలు, తాత్కాలిక బస్ స్టాండ్ల నిర్మాణం కోసం ₹1.14 కోట్లు ఉన్నాయి.