మహారాష్ట్ర ఓటర్లను మహాయుతి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ మహాఘాడీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహాఘాడీకి దేశాన్ని ముందుకు నడిపించే ఉద్దేశం లేదని ఆరోపించారు.
థానే : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బుధవారం మహారాష్ట్ర అసెంబ్లి ఎన్నికల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' నిర్మించే బీజేపీకి ఓటర్ల మద్దతు ఇవ్వాలని కోరారు. మహాయుతి, మహాఘాడీల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని, మహాఘాడీ దగ్గర స్టీరింగ్ లేని, టైర్లు కూడా పోయిన ఓ బండి ఉందని ఎద్దేవా చేశారు. డ్రైవింగ్ సీటు కోసం వాళ్ళు పోటీ పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వంలో దేశద్రోహులకు పెద్దపీట వేసే మహాఘాడీకి దేశాన్ని ముందుకు నడిపించే ఉద్దేశం లేదని, నైతిక బలం కూడా లేదని ఆరోపించారు. ముస్లిం తుష్టికరణతో దేశానికి నష్టం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు.
కరంజా నుంచి బీజేపీ అభ్యర్థి సాయిప్రకాష్ డహకే, వాషిం నుంచి శ్యామ్ రామ్ చరణ్ ఖోడే, ఉల్హాస్ నగర్ నుంచి కుమార్ ఉత్తమ్ చంద్ అయిలని, మీరా భైందర్ నుంచి నరేంద్ర లాల్ చంద్ మెహతా, ఓవలా మాజివాడ నుంచి శివసేన షిండే వర్గం అభ్యర్థి ప్రతాప్ సర్నాయక్ లకు యోగీ బహిరంగ సభలు నిర్వహించారు.
undefined
2014 ముందు పాకిస్తాన్ దేశంలోకి చొరబాట్లు చేసేదని, అప్పుడు చర్యలు తీసుకోవాలని అడిగితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సంబంధాలు చెడిపోతాయని చెప్పేదని యోగీ ఆరోపించారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో దేశం మారిందని, సరిహదుల రక్షణ గురించి భారత్ కు అవగాహన ఉందని, ఎవరినీ రెచ్చగొట్టకపోయినా, రెచ్చగొడితే ఊరుకోదని అన్నారు. 370 రూపుమాసిపోయిందని, కాంగ్రెస్ దాన్ని తిరిగి అమలు చేయాలని కోరుకుంటోందని, కానీ మోదీ దాన్ని అనుమతించరని అన్నారు.
బంజారా సమాజం ఒకప్పుడు అస్తిత్వా సంక్షోభంలో ఉండేదని, ఇప్పుడు వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చామని, బాబూసింగ్ మహారాజ్ ను ఎమ్మెల్సీని చేశామని యోగీ అన్నారు. బంజారా సమాజాన్ని మతమార్పిడి చేసి తప్పుదోవ పట్టించాలని చూసే దేశ వ్యతిరేక శక్తులు ఇప్పుడు సాధించలేవని అన్నారు.
మోదీ నాయకత్వంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపట్టామని, వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్, హర్ ఘర్ నల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, యువతకు ఉపాధి కల్పన లాంటి పథకాలు అమలు చేస్తున్నామని, లడ్లీ బెహన్ పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో నెలకు 2100 రూపాయలు జమ చేస్తున్నామని యోగీ అన్నారు. కరోనా సమయంలో కూడా మహాఘాడీ ఏమీ చేయలేదని, ఖజానా దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నా అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు సాధించలేకపోయిందని, 65 ఏళ్ళలో కాంగ్రెస్ చేయలేని పనిని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేసిందని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని అన్నారు.
మహిళలు, యువత, పేదలు కాంగ్రెస్ ఎజెండాలో ఎప్పుడూ లేరని, వారు కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజలను విడగొడుతున్నారని, దేశాన్ని, సమాజాన్ని విడగొట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించారని, నక్సలిజం, అరాచకత్వాన్ని పెంచారని యోగీ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, విడిపోతే నష్టపోతారని, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ నిర్మించే బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
మహారాష్ట్ర గడ్డపై జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలగంగాధర్ తిలక్, సాహూజీ మహారాజ్, పేష్వా బాజీరావ్, వీర్ సావర్కర్, బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మహనీయులను యోగీ స్మరించుకున్నారు.