Union Budget 2024:ఆదాయపన్ను స్లాబులు యథాతథం, నిర్మలా సీతారామన్ బడ్జెట్ పూర్తి వివరాలివీ...

By narsimha lode  |  First Published Feb 1, 2024, 1:29 PM IST

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం నాడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  ఆరోసారి వరుసగా  నిర్మలా సీతారామన్  బడ్జెట్ ను ప్రవేశ పెట్టి  మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.



న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం నాడు  మధ్యంతర బడ్జెట్  2024ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.  వరుసగా ఆరోసారి  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి  నిర్మలా సీతారామన్. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్  మొరార్జీ దేశాయ్  రికార్డును సమం చేశారు. 

గురువారం నాడు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  రూ. 47.66 లక్షల కోట్లతో  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను  ప్రవేశ పెట్టారు. 

Latest Videos

మోడీ నాయకత్వంలోని  తమ ప్రభుత్వం  నాలుగు వర్గాలకు  ప్రాధాన్యత ఇచ్చినట్టుగా  నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  రైతులు, మహిళలు, యువత,  పేదలను శక్తివంతం చేసేందుకు  తమ ప్రభుత్వం  పనిచేసిందన్నారు.  2047 నాటికి  పేదరికాన్ని పారదోలాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా   కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలోని నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ భీమా యోజన కింద  పంటల భీమా  అందించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

పేదలకు  జన్ ధన్ ఖాతాల ద్వారా  రూ. 34 లక్షల కోట్లను అందించిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు  ఆర్ధిక సహాయం అందించినట్టుగా  కేంద్ర మంత్రి చెప్పారు.

ప్రపంచంలో వ్యాప్తంగా  ఆర్ధిక రంగం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ  భారత్ అన్ని రంగాల్లో వృద్దిలో సాగిన విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.  భారత దేశ ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఆదాయ పన్నులో పాత స్లాబులే

ఆదాయ పన్నులో పాత స్లాబులే కొనసాగించనున్నట్టుగా కేంద్రప్రభుత్వం  ప్రకటించింది.  ప్రతి ఏటా రూ. 7 లక్షల వరకు  ఆదాయం ఉన్నవారికి  ఆదాయ పన్ను ఉండదు. గత ఆర్ధిక సంవత్సరం కూడ ఇదే విధానం ఉంది.  అయితే కొత్త పన్ను విధానం అమలు చేస్తామని  కేంద్ర మంత్రి  నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. 

టూరిజంపై ఫోకస్

 టూరిజంపై  కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది.  లక్షద్వీప్ లపై భారీగా పెట్టుబడులను పెట్టనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  వివరించారు. పర్యాటక రంగాన్ని  అభివృద్ది చేయడంతో  ఉపాధి కూడ లభిస్తుందని  కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.  భారత్, మాల్దీవుల మధ్య  దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుండి  మాల్దీవులకు  పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

వచ్చే ఐదేళ్లలో  2 కోట్ల ఇళ్ల నిర్మాణం

వచ్చే ఐదేళ్ల కాలంలో  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద  2 కోట్ల ఇళ్లను నిర్మించాలని  కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరో వైపు రూఫ్ టాఫ్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు  300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.

ఆరోగ్య భద్రత

9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు  ఆయుష్మాన్  పథకాన్ని వర్తించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. 

జీడీపీపై ఫోకస్

గత పదేళ్లలో  250 మిలియన్ల ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చినట్టుగా  చెప్పారు.
ద్రవ్యోల్బణం తగ్గడమే కాకుండా ఆర్ధిక వృద్ది వేగాన్ని అందుకున్నట్టుగా కేంద్రం అభిప్రాయపడింది.2047 నాటికి పెట్టుకున్న లక్ష్యాల సాధన కోసం ముందుకు సాగుతున్నట్టుగా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 


పలు రంగాలకు  కేటాయింపులు

రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు
హోంశాఖ: రూ.2.03 లక్షల కోట్లు
రైల్వేశాఖ: రూ. 2.55 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ: రూ. 1.77లక్షల కోట్లు
కమ్యూనికేషన్లు: రూ. 1. 37 లక్షల కోట్లు
వ్యవసాయం:రూ. 127 లక్షల కోట్లు
సోలార్ విద్యుత్: రూ. 8500 కోట్లు
ఆయుష్మాన్ భారత్: రూ.7,500 కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ పథకం:రూ. 86 వేల కోట్లు

click me!