ఢిల్లీలో బయటపడ్డ ఎర్రకోట సొరంగం.. బ్రిటీషర్లు దీనిని దేనికోసం వినియోగించారంటే?

By telugu teamFirst Published Sep 3, 2021, 12:36 PM IST
Highlights

ఢిల్లీలో బ్రిటీషర్ల కాలం నాటి సొరంగం బయటపడింది. భారత స్వాతంత్ర్య సమరయోధులను ఎర్రకోట నుంచి నేడు ఢిల్లీ అసెంబ్లీగా వినియోగిస్తున్న అప్పటి కోర్టుకు తరలించేవారు. వీరి తరలింపులో ఆందోళనలు, ప్రతీకార చర్యలను నివారించడానికి ఈ సొరంగాన్ని వినియోగించారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: ఇప్పటికీ మనదేశంలో వలసవాదుల కాలం నాటి అనేక అవశేషాలు కనిపిస్తుంటాయి. అందులో ప్రముఖంగా కట్టడాలుంటాయి. రైల్వే స్టేషన్లు, డ్యామ్‌లు, ప్రాజెక్టులు, టూరిస్టు ప్రాంతాలుగా మారిన కట్టడాలు బ్రిటీషర్ల కాలంలో ప్రముఖంగా ఇప్పటికీ కనిపిస్తుంటాయి. అయితే, వారు భారత స్వాతంత్ర్య సమరయోధులను హింసించడానికి ఉపయోగించినవి పెద్దగా బయటకు కనిపించవు. ఇలాంటి రహస్యాలు చరిత్రలో మరెన్నో దాగి వున్నాయి. అప్పుడప్పుడు ఆకస్మికంగా బయటపడ్డప్పుడు ఆశ్చర్యానికి గురవుతుంటాం. తాజాగా, ఢిల్లీలో ఇలాంటిదే ఒక సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటను అనుసంధానించేదిగా భావిస్తున్న సొరంగం కనిపించింది. దీనికి ఘనమైన చరిత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన చరిత్ర ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ సొరంగంపై ఆసక్తి వెల్లడవుతున్నది.

మనదేశం సమరయోధులను కోర్టు నుంచి లాల్ ఖిల్లాకు తరలించేటప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రతీకారాలను నివారించడానికి బ్రిటీషర్లు దొడ్డిదారిని ఉపయోగించేవారు. అందులో భాగంగానే కోర్టు నుంచి నేరుగా ఎర్రకోటకు తీసుకెళ్లే ఈ సొరంగాన్ని వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు.

స్పీకర్ గోయల్ మాట్లాడుతూ ‘నేను 1993లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇక్కడి నుంచి ఎర్రకోటను కలిపే సొరంగం ఉన్నట్టు విన్నాను. దీని చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కానీ, దీనిపై స్పష్టత లభించలేదు. ఇప్పుడు మనకు ఆ సొరంగం ముఖద్వారం కనిపించింది. కానీ, దీనిని మరింత లోపలకు తవ్వాలని భావించట్లేదు. ఎందుకంటే మెట్రో ప్రాజెక్టులు, డ్రెయినేజీ కారణంగా చాలా చోట్ల ఇది నాశనమైంది’ అని వివరించారు.

బ్రిటీషర్లు తమ రాజధానిని 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీని మార్చుకున్నారని గోయల్ తెలిపారు. అప్పుడు ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వాడేవారని వివరించారు. దీనిని 1926లో కోర్టుగా మార్చారని, అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్లను కోర్టుకు తీసుకురావడానికి ఈ సొరంగాన్ని వినియోగించేవారని చెప్పారు. అంతేకాదు, స్వాతంత్ర్య సమరయోధులను శిక్షించే గదులూ ఇక్కడ ఉన్నాయని, కానీ, వాటిని ఎన్నడూ తెరవలేదని వివరించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు గడుస్తున్న సందర్భంగా ఈ గదులను పరిశీలించాని నిర్ణయించామని తెలిపారు. ఆ గదులను స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా తెరవాలని భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే స్వాతంత్ర్యదినోత్సవం నాటికి వీటిని పర్యాటక కేంద్రాలుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతాలన్నీ స్వాతంత్ర్య సమరానికి సంబంధించి ఘనమైన చరిత్రను కలిగి ఉన్నాయని, వాటిని సందర్శకులకు వివరించే ప్రయత్నంగా వీటిని తెరవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

click me!