
Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session 2022) ప్రారంభం కానున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన కరోనా ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పార్లమెంట్ వర్గాలు.. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా, ఈ బడ్జెట్-2022 సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మళ్లీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడుతల బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. నేడు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అయితే, పార్లమెంట్‌లో కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు టీఆర్‌ఎస్ ఎంపీలు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం కేంద్రంపై పోరాటం చేయాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ పార్లమెంటు సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ఆయన టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఆదివారం నాడు ప్రగతి భవన్‌లో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. తెలంగాణ విజ్ఞప్తులపై స్పందించని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై టీఆర్‌ఎస్ ఎంపీలు పూర్తిస్థాయిలో దాడికి చేసేవిధంగా మందుకు సాగాడానికి సిద్ధమయ్యారు.
“బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది, ముఖ్యంగా రైతులు మరియు ఉద్యోగుల వ్యతిరేక విధానాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను (పిఎస్‌యులు) అమ్మేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. బదులుగా, తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై కేంద్ర మంత్రులచే ప్రశంసలు పొందుతూ.. దూషణలకు దిగుతునే ఉన్నారు. మేము దీన్ని సహించాల్సిన అవసరం లేదు.. బదులుగా, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుల ద్వంద్వ భావాలను బహిర్గతం చేయాలి”అని కేసీఆర్ వివరించారు.
కేసీఆర్ సూచనలతో రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై పోరు సాగిస్తామనీ, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటిని అందేలా ప్రయత్నాలు ఉంటాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై పార్లమెంట్ లో గళం విప్పడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా జీఎస్టీ బకాయిలతో సహా కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తాలని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు సహా టీఆర్‌ఎస్ ఎంపీలందరికీ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన 23 పెండింగ్ సమస్యల జాబితాను అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిలో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన గ్రాంట్‌ల గురించిన అంశాలను లేవనెత్తాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, వారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన కేటాయింపులను గమనించిన తర్వాత మాత్రమే 2022-23 కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తారని తెలిపారు.