
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్పూర్తిదాయకం అన్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతుందన్నారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ప్రతి భారతీయుడికి స్వాతంత్ర్య అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తున్నట్టుగా వెల్లడించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
‘స్వాతంత్ర్య సమరయోధులకు నేను నమస్కరిస్తున్నాను. దేశాభివృద్ది ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నాను. దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యం. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. వచ్చే 25 ఏళ్ల పాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం, పౌరుల మధ్య ఈ పరస్పర విశ్వాసం, సమన్వయం, సహకారం ప్రజాస్వామ్య శక్తికి అపూర్వమైన ఉదాహరణ. దేశంలోని ప్రతి ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్‌ను, ప్రతి దేశస్థుడిని అభినందిస్తున్నాను.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతుంది. ఏడాదిలోపే 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన రికార్డును అధిగమించాం. దేశంలో 90 శాతం కంటే ఎక్కువ మంది వయోజన పౌరులు టీకా తొలి డోసును మోతాదును పొందారు. 70 శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసులు పొందారు. ప్రపంచాన్ని అంటువ్యాధుల నుండి విముక్తి చేయడంలో మరియు కోట్లాది మంది ప్రజల ప్రాణాలను రక్షించడంలో భారతదేశంలో తయారవుతున్న టీకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. రూ.64 వేల కోట్లతో ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్.. ప్రస్తుత ఆరోగ్య అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా రాబోయే సంక్షోభాలకు దేశాన్ని సిద్ధం చేస్తుంది.
ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని సామాన్యులకు ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. 80 వేలకు పైగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు మరియు కోట్లాది ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదలకు వారి చికిత్సలో సహాయం చేశాయి. 8000 కంటే ఎక్కువ జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలకు మందులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వం చికిత్స ఖర్చును తగ్గించింది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా.. యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ నిరంతరం పెరుగుతోంది.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూల మంత్రంపై ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా ఉచిత రేషన్ ఇస్తోంది. 44 కోట్ల మందికి పైగా పేద దేశస్థులు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించబడినందున, మహమ్మారి సమయంలో కోట్లాది మంది లబ్ధిదారులు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనం పొందారు.
డిజిటల్ ఇండియా సందర్భంలో దేశం యొక్క UPI ప్లాట్‌ఫారమ్ విజయవంతమవడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వ్యాప్తి కోసం ప్రభుత్వం చూపిన విజన్‌ను కూడా నేను అభినందిస్తున్నాను. డిసెంబర్ 2021లో దేశంలో UPI ద్వారా 8 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరాల్లో అవిశ్రాంత ప్రయత్నాల వల్ల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు రెండు కోట్లకు పైగా పక్కా గృహాలు అందించబడ్డాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్'కింద గత మూడేళ్లలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలతో.. కోటి పదిహేడు లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. హర్ ఘర్ జల్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడం ప్రారంభించింది.
దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లను చేపట్టింది. ప్రభుత్వ కృషి వల్ల దేశ వ్యవసాయ ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఎగుమతి దాదాపు రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లక్ష 80 వేల కోట్ల రూపాయలు అందించారు. ఈ పెట్టుబడితో నేడు వ్యవసాయ రంగంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతమవుతోంది. 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ. ట్రిపుల్ తలాక్‌ను చట్టరీత్యా నేరంగా ప్రకటించడం ద్వారా సమాజాన్ని ఈ దురాచారాల నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ప్రోత్సాహంతో వివిధ పోలీసు బలగాల్లో మహిళా పోలీసుల సంఖ్య 2014తో పోలిస్తే రెట్టింపు అయింది. జాతీయ విద్యా విధానం ద్వారా స్థానిక భాషలను ప్రచారం చేస్తున్నారు. భారతీయ భాషల్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కాలేజీల్లో 6 భారతీయ భాషల్లో బోధన ప్రారంభమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యాన్ని మనమందరం చూశాం.
యువతకు అంతులేని కొత్త అవకాశాలకు స్టార్టప్ ఎకో-సిస్టమ్ ఒక ఉదాహరణ.నేడు ఇంటర్నెట్ ఖర్చు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. స్మార్ట్ ఫోన్ల ధర కూడా తక్కువగా ఉంది. దీని వల్ల భారత యువ తరానికి భారీ ప్రయోజనం కలుగుతోంది. భారతదేశం మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ అవతరించింది. మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి.
పురుషులతో సమానంగా మహిళలకు వివాహ కనీస వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచడానికి కూడా ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. స్వాతంత్య్ర పోరాటంలో బాపు నాయకత్వంలో దేశ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఖాదీ.. మరోసారి చిరు పారిశ్రామికవేత్తలకు ఆసరాగా మారుతోంది. ప్రభుత్వ కృషితో దేశంలో ఖాదీ విక్రయాలు 2014తో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. అవస్థాపన-అభివృద్ధి పనులకు మరింత ఊతమివ్వడానికి, నా ప్రభుత్వం ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ రూపంలో వివిధ మంత్రిత్వ శాఖల పనిని ఏకం చేసింది.
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన సాధించిన విజయాలు గర్వించదగినవి. మార్చి 2014లో మన దేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 90 వేల కిలోమీటర్లు కాగా, నేడు వాటి పొడవు లక్షా నలభై వేల కిలోమీటర్లకు పైగా పెరిగింది. దేశంలోని 11 కొత్త మెట్రో లైన్లలో సేవలు ప్రారంభించబడ్డాయి. ఇవి ప్రతిరోజూ 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
దేశ భద్రత కోసం ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తోంది. ప్రభుత్వ విధానాల వల్ల రక్షణ రంగంలో, ముఖ్యంగా రక్షణ ఉత్పత్తిలో దేశం యొక్క స్వావలంబన నిరంతరం పెరుగుతోంది. 83 LCA తేజస్ యుద్ధ విమానాల తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 డిఫెన్స్ పీఎస్‌యూలుగా మార్చడానికి ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్‌లు, అపెరల్ పార్క్‌లను ప్రభుత్వం దాదాపు రూ.4500 కోట్ల పెట్టుబడితో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ వాల్యూ చైన్‌ను సృష్టిస్తుంది.
భారతదేశం అమూల్యమైన వారసత్వాన్ని తిరిగి దేశానికి తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రాధాన్యత. వంద సంవత్సరాల క్రితం భారతదేశం నుండి చోరీకి గురైన అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి తీసుకువచ్చి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిష్టించారు. మన MSMEలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. మన బలగాలకు అవసరమైన వస్తువులను భారతదేశంలోనే అభివృద్ధి చేసి.. భారతదేశంలోనే తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధికి దాదాపు రూ.28 వేల కోట్లతో ప్రభుత్వం కొత్త కేంద్ర రంగ పథకాన్ని ప్రారంభించింది. అక్కడి ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం మెరుగైన అవకాశాలను అందించడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకోబడ్డాయి. ప్రభుత్వ కృషితో ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ ఇప్పుడు రైల్వే మ్యాప్‌లోకి రావడం దేశానికే గర్వకారణం. గత ఏడేళ్లలో 24 వేల కి.మీ రైల్వే మార్గాన్ని విద్యుదీకరించారు.
అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశ పౌరులలో అనేకమందిని, అనేకమంది ఆఫ్ఘన్-హిందూ-సిక్కు-మైనారిటీలను కాబూల్ నుండి విజయవంతంగా విమానంలో రప్పించాము. 'మిషన్ కర్మయోగి' కింద.. సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 'మిషన్ కర్మయోగి' సివిల్ సర్వెంట్ల కెరీర్‌లో కూడా సహాయపడటమే కాకుండా.. దేశ నిర్మాణ కొత్త బాధ్యతలకు వారిని సిద్ధం చేస్తుంది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న కర్బీ-అంగ్లాంగ్ వివాదానికి ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, కర్బీ గ్రూపుల మధ్య కొద్ది నెలల క్రితమే ఒప్పందం కుదిరింది. ఇది ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు యొక్క కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. నేడు దేశం సాధిస్తున్న విజయాలు.. దేశం యొక్క సామర్ధ్యాలు, అవకాశాల వలె అపరిమితంగా ఉన్నాయి. ఈ విజయాలు కోట్లాది దేశ ప్రజల శ్రమతో కూడుకున్నవి.
2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతాయి. ఆనాటి భవ్యమైన, ఆధునికమైన, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనం ఈరోజు కష్టపడాలి. మన కష్టాన్ని చివరి వరకు తీసుకెళ్లాలి.. అది చివరికి ప్రయోజనకరమైన ఫలితాలను ఇచ్చేలా చూడాలి. ఇందులో మనందరికీ సమాన భాగస్వామ్యం ఉంది’ అని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.