అద్భుత ఆవిష్కరణ.. కరోనా నుంచి ఎప్పుడు కోలుకుంటారో చెప్పే మెషీన్.. బ్రతికే చాన్స్‌నూ పసిగడుతుంది

By Mahesh KFirst Published Jan 21, 2022, 8:45 PM IST
Highlights

కరోనా మహమ్మారి బారిన పడిన వ్యక్తి ఎంత కాలంలో కోలుకోగలడు అనే విషయాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ మెషీన్‌తో కరోనా పేషెంట్ కోలుకోవడానికి పట్టే సమయమే కాదు.. ఆయనలో ఎంత తీవ్రతతో కరోనా ఉన్నదో వెల్లడిస్తుంది. అంతేకాదు, సదరు పేషెంట్ బ్రతకడానికి గల అవకాశాలనూ అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 

న్యూఢిల్లీ: సవాళ్లు విసిరే కాలమే.. నూతన ఆలోచనలకు బీజం వేస్తుంది. సమస్యల సుడిగుండాలే.. కొత్త ఉదయాలకు దారులు తెరుస్తాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే.. హాస్పిటళ్లు భారంతో కుంగిపోతుంటే.. జర్మనీలో ఊరటనిచ్చే ఓ ఆవిష్కరణ వెలుగుచూసింది. వచ్చే యుగమంతా కృత్రిమ మేధస్సుదేననే అభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ మరోసారి మెరిసింది. కరోనా పేషెంట్(Corona Patient) ఆ మహమ్మారి నుంచి ఎన్ని రోజుల్లో కోలుకునే శక్తి కలిగి ఉన్నాడని, ఆయన బతికి ఉండే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి అనే విషయాన్ని అంచనా(Predict) వేస్తున్నది. జర్మనీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పేషెంట్ రక్తం శాంపిళ్లను దానికి ఇస్తే.. అందులోని ప్రోటీన్‌లను గణించి 14 లెవెల్స్‌ను పరీక్షించి సదరు పేషెంట్ కరోనా నుంచి కోలుకునే అవకాశాలు ఎన్ని ఉన్నాయి? ఒక వేళ కోలుకుంటే ఎంత కాలం పడుతుంది? అతను జీవించే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే విషయాలను వెల్లడిస్తున్నది.

ఈ మెషీన్ ద్వారా వైద్యారోగ్య సిబ్బంది పేషెంట్ స్థితిని సులువు తెలుసుకోగలరు. ఎంత మేర ట్రీట్‌మెంట్ అవసరం.. ఏ స్థాయిలో ట్రీట్‌మెంట్ అవసరం అనే విషయాలను నిర్ధారించుకోవచ్చు. క్రిటికల్ కేర్ అవసరమా? సాధారణ చికిత్సతో నయం అవుతుందా? అనే విషయాన్ని చాలా తక్కువ సమయంలో నిర్ధారించుకోవచ్చు. తద్వారా ఆరోగ్య వసతుల సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాం. ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు అత్యధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. హాస్పిటలైజేషన్ రేటు తక్కువ ఉన్నప్పటికీ కేసులు సంఖ్య భారీగా ఉండటంతో ఒకానొక దశలో ఆరోగ్య వ్యవస్థకే సవాల్ విసిరే ముప్పు ఉన్నది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ మంది ఆరోగ్య సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలం అవుతున్నది. ఈ భారాన్ని తగ్గించడానికి నూతన ఆవిష్కరణ ఎంతో ఉపయుక్తం కానుంది.

మెషీన్ లెర్నింగ్ ద్వారా ఈ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. 50 మంది పేషెంట్లపై ఈ టెక్నాలజీతో పరీక్షలు జరిపారు. అందులో 15 మంది పేషెంట్లు మరణించారు. ఈ 50 మంది పేషెంట్ల నుంచి ప్రొటీన్ లెవెల్స్‌ను శాస్త్రజ్ఞులు సేకరించారు. ఈ పేషెంట్ల డేటా ఆధారంగా ఈ మెషీన్‌లో మార్పులు చేశారు. అనంతరం, ఈ మెషీన్‌తో 24 మంది కరోనా పేషెంట్లను పరీక్షించారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌తో పరీక్షించిన 24 మంది కరోనా పేషెంట్లలో ఐదుగురు మరణించారు. ఈ మెషీన్ కూడా కచ్చితత్వంతో ఐదుగురు మరణిస్తారని అంచనా వేసింది. శాస్త్రవేత్తలు ఈ నూతన ఆవిష్కరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మెషీన్ డెవలప్ చేయడానికి ఇచ్చిన శాంపిళ్లు, పరీక్షించిన శాంపిళ్లూ స్వల్ప మొత్తంలో ఉన్నాయని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ‌త 24 గంట‌ల్లో భారతదేశంలో 3,47,254 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గ‌డిచిన 249 రోజులలో అత్యధికమైన కేసులు.  మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 9,287 కు పెరిగాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825 కు చేరుకుంది. గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 2,51,777 కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ శుక్రవారం బులిటిన్ (health buliten) విడుద‌ల చేసింది.

click me!