ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రయాణించిన తేజస్ యుద్ధ విమానం భారత వైమానిక రంగంలో కీలకమైనది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆలోచనలో ఈ తేజస్ ఫైటర్ జెట్ రూపుదిద్దుకుంది. ఈ ఫైటర్ జెట్ గురించి 5 ముఖ్యాంశాలు చూద్దాం.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ రోజు తేజస్ ఫైటర్ జెట్ పై ఓ ట్రిప్ వేశారు. మోడీ ప్రయాణించిన ఈ తేజస్ యుద్ధ విమానం గురించి ఆసక్తి నెలకొంది. ఈ ఫైటర్ జెట్ గురించి ఐదు ముఖ్య విషయాలను చూద్దాం.
1. ప్రధాని మోడీ ప్రయాణించింది రెండు సీట్లు ఉండే తేజస్ ట్రైనర్. భారత వైమానిక దళంలో ఈ జెట్ ఒక కొత్త బ్రాండ్. యుద్ధానికి కావాల్సిన సామర్థ్యాలతో సిద్ధమైంది. ఈ మల్టీ రోల్ ఫైటర్ జెట్‌ను ప్రభుత్వ అధీనంలోని హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నది.
2. సాధారణంగా ప్రధానమంత్రి రెండు ఇంజిన్‌లు ఉండే ఫైటర్ జెట్ పై ప్రయాణిస్తారు. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా.. మరో ఇంజిన్ సహాయంతో అవాంతరాలను, ప్రమాదాలను తప్పించుకోవచ్చు. కానీ, నరేంద్ర మోడీ మాత్రం సింగిల్ ఇంజిన్ గల తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. ఈ యుద్ధ విమానం పై ప్రభుత్వానికి గల నమ్మకాన్ని ఇది వెల్లడిస్తున్నది.
3. రానున్న సంవత్సరాల్లో భారత వైమానిక దళంలో తేజస్ విమానం ప్రముఖంగా మారనుంది. ప్రస్తుతం దేశ సేవలో అనేక తేజస్ యుద్ధ విమానాలు (Tejas Fighter Jet) ఉన్నాయి. మరెన్నో తేజస్ విమానాలు ఇంకా వైమానిక దళంలో చేరనున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 83 తేజస్ ఎంకే1ఏ జెట్ల తయారీ 2029 కల్లా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : PM Modi: ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదు.. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోడీ
4. భారత రక్షణ కొనుగోళ్లు ఆత్మనిర్భరత (Aatma Nirbhar Bharat) కేంద్రంగా సాగుతున్నాయి. ఈ స్వయం సమృద్ధతలో తేజస్ యుద్ధ విమానాలు కీలకంగా ఉన్నాయి. దశల వారీగా కొత్త టెక్నాలజీలతో తేజస్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేస్తారు. మరిన్ని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలను చేరుస్తారు. శక్తివంతమైన స్థాయికి క్రమ క్రమంగా తేజస్ యుద్ధ విమానాలు అప్‌గ్రేడ్ అవుతాయి. చివరగా అవి తేజస్ ఎంకే2గా పరిణామం చెందుతాయి.
5. హెచ్ఏఎల్ ఇటీవలే ఇంజిన్ల కోసం జనరల్ ఎలక్ట్రిక్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని వాషింగ్టన్‌లో ప్రకటించారు. ఇందులో పదుల సంఖ్యలో ఇంజిన్లు తేజస్ యుద్ధ విమానాల కోసం రానున్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్414 ఇంజిన్లను తయారు చేయడానికి భారత్‌లో యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఈ ఇంజిన్లే తేజస్ ఎంకే2 యుద్ధ విమానాలకు ఉపయోగిస్తారు.