LOC: అక్రమంగా చొరబడుతుండగా మీ జవాన్‌ను చంపేశాం.. డెడ్ బాడీ తీసుకెళ్లండి: పాకిస్తాన్‌తో భారత ఆర్మీ

By Mahesh KFirst Published Jan 2, 2022, 4:22 PM IST
Highlights

పాకిస్తాన్ నుంచి సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించ ప్రయత్నించిన ఓ దుండగుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆయన దగ్గర లభించిన కార్డులతో ఆ దుండగుడు పాకిస్తాన్ జాతీయుడని తెలుస్తున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. బహుశా ఆ దేశ బార్డర్ యాక్షన్ టీమ్ సభ్యుడై ఉంటాడని వివరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీకి హాట్‌లైన్ ద్వారా తెలియజేశామని, ఆ డెడ్ బాడీని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొన్నారు.
 

శ్రీనగర్: పాకిస్తాన్(Pakistan) దాని కవ్వింపు చర్యలను ఆపడం లేదు. భారత్‌లో కల్లోలం సృష్టించడానికి శాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నది. రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదాన్ని(Terrorism) ప్రోత్సహిస్తున్నది. ఏకంగా ఆ దేశ ఆర్మీనే మన దేశంలోకి అక్రమంగా పంపే కుయుక్తులు చేస్తున్నట్టు తాజాగా మరోసారి వెల్లడైంది. ఎన్నిసార్లు పాకిస్తాన్ దుష్టచర్యలకు పాల్పడే ప్రయత్నాలు చేసినా.. భారత ఆర్మీ వారి కుట్రలను సమర్థంగా తిప్పి కొట్టాయి. గతేడాడి ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పులు విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. తాజాగా, పాకిస్తాన్ నుంచి సరిహద్దు గుండా మన దేశంలోకి అక్రంగా చొరబాటుకు యత్నించిన ఓ దుండగుడిని వెంటనే గుర్తించి భారత ఆర్మీ దళాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నాల్లో ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆ దుండగుడు మరణించాడు. ఆ వ్యక్తి ఐడీ కార్డు ద్వారా అతను పాకిస్తాన్ జాతీయుడని, బహుశా ఆ దేశ ఆర్మీలో పని చేసి ఉంటాడని భారత ఆర్మీ(Indian Army) అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, ఆ డెడ్ బాడీ(Dead Body)ని వెనక్కి తీసుకోవాలని పాకిస్తాన్ ఆర్మీకి సమాచారం ఇచ్చారు.

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసిందని జీవోసీ 28 ఇన్ఫాంట్రీ డివిజన్ మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ వివరించారు. ఎల్‌వోసీలో ఆర్మీ వేగమైన ప్రతిచర్య చేపట్టిందని తెలిపారు. ఆ ఉగ్రవాదిని భారత ఆర్మీ చంపేసిందని, ఆ టెర్రరిస్టు పాక్ జాతీయుడని వివరించారు. మృతుడి పేరు మొహమ్మద్ షాబిర్ మాలిక్‌గా గుర్తించినట్టు మరో సీనియర్ మిలిటరీ అధికార తెలిపారు. పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్ సభ్యుడి అయి ఉండొచ్చని వివరించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసిన ఫెన్స్‌కు పాకిస్తాన్ వైపున ఈ ఘటన జరిగిందని మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ తెలిపారు.

Also Read: డ్రాగన్ దూకుడు: అరుణాచల్‌ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు పేర్లు మార్చిన చైనా

చొరబాటు యత్నాన్ని ముందుగానే గ్రహించి ప్రతిచర్య తీసుకున్నారని, దీంట్లో ఆ వ్యక్తి మరణించాడని మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ తెలిపారు. ఆ బాడీని రికవరీ చేసుకున్నామని వివరించారు. ఆయనతోపాటు ఓ ఏకే రైఫిల్, పేలుడు సామగ్రి, ఏడు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ ఏరియాపై నిఘా ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. సరిహద్దు గుండా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదని తెలుపడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని ఆరోపించారు. ఇటు వైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీకి హాట్‌లైన్ ద్వారా కమ్యూనికేట్ అయినట్టు తెలిపారు. ఆ వ్యక్తి డెడ్ బాడీని తీసుకెళ్లాల్సిందిగా వారికి వివరించినట్టు పేర్కొన్నారు.

Also Read: పాకిస్తాన్ నుంచి వ‌స్తున్న డ్రోన్ ను పంజాబ్‌లో కూల్చేసిన బీఎస్ఎఫ్‌

ఆ వ్యక్తి డెడ్ బాడీని సోదా చేస్తా.. ఆయన దగ్గర కొన్ని దస్త్రాలు బయటపడ్డాయని వివరించారు. అందులో పాకిస్తాన్ నేషనల్ ఐడీ ఒకటి.. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన టీకా పంపిణీ సర్టిఫికేట్ లభించాయని తెలిపారు. కార్డుపై ఉన్న ఫొటోనూ పరిశీలిస్తే.. ఆ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ దుస్తుల్లో కనిపించారని పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ చర్య పూర్తిగా ఉల్లంఘిస్తున్నదని తెలిపారు.

click me!