సీఈసీగా ఉత్తమైన వ్యక్తి ఉండాలి.. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి అవసరం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 11:03 AM IST
Highlights

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సున్నితమైన భుజాలపై రాజ్యాంగం చాలా బాధ్యతను ఉంచిందని సుప్రీం కోర్టు పేర్కొంది. బలమైన వ్యక్తిని ఆ పదవిలో నియమించడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సున్నితమైన భుజాలపై రాజ్యాంగం చాలా బాధ్యతను ఉంచిందని సుప్రీం కోర్టు పేర్కొంది. బలమైన వ్యక్తిని ఆ పదవిలో నియమించడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది.  ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టీఎన్‌ శేషన్‌ వంటి బలమైన వ్యక్తి అవసరమని తాము కోరకుంటున్నట్టుగా తెలిపింది. ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు ఉన్నారు. 

ఉత్తమ వ్యక్తి సీఈసీగా ​​ఎంపికయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రయత్నమని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్లు చాలా మంది ఉన్నారని.. అయితే టీఎన్ శేషన్ ఒక్కరే ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. 1990 నుంచి 1996 వరకు సీఈసీగా కీలక ఎన్నికల సంస్కరణలను తీసుకొచ్చినందుకు ప్రసిద్ధి చెందిన దివంగత టీఎన్ శేషన్ వంటి వ్యక్తిని ఆ పదవికి కోరుతున్నట్టుగా ధర్మాసనం తెలిపింది.

‘‘ముగ్గురు వ్యక్తుల (సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమీషనర్లు) సున్నితమైన భుజాలపై అపారమైన అధికారం ఉంది. సీఈసీ పదవికి ఉత్తమమైన వ్యక్తిని వెతకాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రభావితం కాకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల బలమైన స్వభావం కలిగిన ఉత్తమ రాజకీయ రహిత వ్యక్తిని నియమించడానికి న్యాయమైన, పారదర్శక పద్దతిని అవలంబించాలని తెలిపింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. తాము చాలా మంచి విధానాన్ని రూపొందించామని.. తద్వారా సమర్ధతతో పాటు,  బలమైన వ్యక్తి సీఈసీగా నియమింపబడతారని తెలిపారు. ‘‘ఉత్తమ వ్యక్తి నియామకాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. అయితే ఎలా చేస్తారన్నదే ప్రశ్న. రాజ్యాంగంలో శూన్యత లేదు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లను మంత్రి మండలి సహాయం, సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు’’ అని అటార్నీ జనరల్ చెప్పారు.

దీనిపై స్పందిస్తూ.. 1990 నుంచి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీతో సహా అనేక మంది  ఎన్నికల కమిషన్‌తో సహా రాజ్యాంగ సంస్థల నియామకాలకు కొలీజియం లాంటి వ్యవస్థను కోరుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం. దానిపై ఎలాంటి చర్చకు ఆస్కారం లేదు. మేము కూడా పార్లమెంటుకు ఏదో ఒకటి చేయమని చెప్పలేము. మేము అలా చేయము. 1990 నుంచి లేవనెత్తిన సమస్యకు మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం’’ అని ధర్మాసనం తెలిపింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. అయితే ప్రస్తుత వ్యవస్థను దాటి వెళ్ళనివ్వకుండా అధికార పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుందని తమకు తెలుసని ధర్మాసనం పేర్కొంది. 

2004 నుంచి ఏ సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదని కోర్టు సందర్భంగా ప్రస్తావించింది. పదేళ్ల యూపీఏ హయాంలో ఆరు సీఈసీలు ఉండగా, ఎన్డీయే 8 ఏళ్ల పాలనలో ఎనిమిది మంది మరారని పేర్కొంది. రాజ్యంగంలో నిర్దిష్ట ప్రక్రియ లేకపోవడంతో సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నాయని అభిప్రాయపడింది. 

ఆర్టికల్ 324 (2) సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకం కోసం చట్టాన్ని రూపొందించాలని నిర్దేశిస్తుందని ధర్మాసనం ప్రస్తావించింది. కానీ రాజ్యంగం అమల్లోకి వచ్చిన 72 ఏళ్లు అయినా ఇప్పటికీ చట్టం  తీసుకురాలేదని అన్నారు. రాజ్యాంగం మౌనం ఈ విధంగా దోపిడీ చేయబడుతోందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. 

ఇక, 2018 అక్టోబరు 23న సీఈసీలు, ఈసీల ఎంపికకు కొలీజియం లాంటి వ్యవస్థను కోరుతూ దాఖలైన పిల్‌ను అధీకృత తీర్పు కోసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు రిఫర్ చేసింది. అయితే  సీఈసీలు, ఈసీల ఎంపిక కోసం కొలీజియం లాంటి వ్యవస్థను కోరుతూ వచ్చిన అభ్యర్థనలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాంటి ప్రయత్నం ఏదైనా రాజ్యాంగాన్ని సవరించడమేనని వాదించింది.

click me!