
Mann Ki Baat: రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్, ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలేలకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తమ కుమార్తెల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా రేడియోలో తన నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్-87వ ఎడిషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల ఏప్రిల్ ఇద్దరు మహానుభావులు - మహాత్మా జ్యోతిబా ఫూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ల జయంతిని కూడా జరుపుకుంటామని చెప్పారు. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారని తెలిపారు. ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతి, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్ష మరియు అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా ఫూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు, ఆడ శిశుహత్యకు వ్యతిరేకంగా తన స్వరం పెంచారు. నీటి కొరత లేకుండా చేసేందుకు పెద్దఎత్తున ప్రచారాలు కూడా చేపట్టారని ప్రధాని మోడీ అన్నారు.
మహాత్మా ఫూలే గురించిన ఈ చర్చలో సావిత్రి బాయి ఫూలే ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనదని ప్రధాని అన్నారు. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రి బాయి ఫూలే కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వీరంతా కలిసి సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలలో మహాత్మా ఫూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఏ సమాజం అభివృద్ధి చెందుతుందో ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చని కూడా ఆయన చెప్పేవారు అని మోడీ పేర్కొన్నారు.
అలాగే, “మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని, తల్లిదండ్రులు మరియు సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కూతుళ్లను బడిలో చేర్చేందుకు కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ కూడా కొద్దిరోజుల క్రితం ప్రారంభించబడింది, కొన్ని కారణాల వల్ల డ్రాపౌట్ అయిన బాలికలను తిరిగి పాఠశాలకు తీసుకురావడంపై దృష్టి సారించడం మంచి విషయం. బాబాసాహెబ్‌తో అనుబంధం ఉన్న పంచ తీర్థం కోసం పని చేసే అవకాశం కూడా మాకు లభించడం మనందరి అదృష్టం. మోహౌలో ఆయన జన్మస్థలమైనా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్‌లోని ఆయన నివాసమైనా, నాగ్‌పూర్ దీక్షాభూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్ మహాపరినిర్వాణ స్థలమైనా, అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థయాత్రలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. ప్రజలు మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లు జీవనం గడిపిన ప్రాంతాలను సందర్శించాలని అన్నారు.