
మగాళ్లు మృగాళ్లలా ప్రవరిస్తున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి నిత్యం ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పసి పిల్లలను, ముసలివాళ్లను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీలో ఓ 35 ఏళ్ల యాచకురాలిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టారు.
ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 35 ఏళ్ల మహిళా యాచకురాలిని ఓ ఆటో డ్రైవర్, అతడి స్నేహితుడు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. అయితే బుధవారం ఘాజీపూర్ ప్రాంతంలో అపస్మార స్థితిలో పడి ఉన్న ఆమెను కొందరు స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స కోసం తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించడానికి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ (తూర్పు) ప్రియాంక కశ్యప్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరనీ అరెస్టు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో పోలీసులకు నోటీసులు జారీ చేసింది. బాధితురాలిని ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు అపహరించి, అత్యాచారం చేశారని తెలిపింది. వారిలో ఒకరు ఆటో డ్రైవర్ అని పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం బాధిత మహిళను కొట్టారని తెలిపింది. ఆమె ప్రైవేటు భాగాలకు తీవ్ర గాయాలు అవడంతో ఆపరేషన్ చేసినట్టు నోటీసుల్లో తెలిపింది. మంగళవారంలోగా ఈ వ్యవహారంపై సమగ్ర చర్యలు నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరింది.
2019 డిసెంబర్ నెలలో హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 60 ఏళ్ల యాచకురాలికి ఇద్దరు వ్యక్తులు తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మల్కాజిగిరి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.