పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి పోటీ.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. పద్మ శ్రీ రాకపోవడంపైనా స్పందన

By telugu teamFirst Published Nov 14, 2021, 12:41 PM IST
Highlights

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో యాక్టివిస్టు సోనూసూద్ సోదరి మాల్వికా సూద్ పోటీ చేయనున్నారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. అదే విధంగా తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని సోనూసూద్ చెప్పారు. ఇదే సందర్భంగా ఐటీ దాడులు, పద్మ శ్రీ వంటి కీలక అంశాలపైనా మాట్లాడారు.
 

చండీగడ్: Punjab Elections వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో యాక్టర్, యాక్టివిస్ట్ Sonu Sood సహోదరి Malvika Sood పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ వెల్లడించారు. పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనూసూద్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతున్నదనే విషయాన్ని తెలుపలేదు. ఏ Political Partyలో చేరుతున్నారనే విషయం పెద్దగా చూడాల్సిన పనిలేదని, కానీ, ఆమె ఏ పాలసీతో రాజకీయంలోకి ప్రవేశిస్తున్నారన్నదే ముఖ్యమైన అంశమని అన్నారు. దీనితోపాటు ఆయన పొలిటికల్ ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉంటారని, ఐటీ దాడులైనా.. మరే ఇతర కారణాలైన ఆ సేవ నిలిపేయడం జరగదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశంపై ఆసక్తి లేదని వివరించారు. అంతేకాదు, Padma Shri award తనకు రాకపోవడంపైనా స్పందించారు.

విద్య, ఆరోగ్యంపైనే తమ కుటుంబం ఎక్కువగా ఫోకస్ పెడుతుందని సోనూసూద్ అన్నారు. తాను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదని తెలిపారు. అయితే, సమాజ సేవ చేసే వేదికల్లో చేరుతారని వివరించారు. ఆ వేదిక రాజకీయానికి చెందినదైనా, మరేదైనా, సమాజానికి సేవ చేసేదైతే అందులో చేరుతారని తెలిపారు. అందులో తనను స్వతంత్రంగా సేవ చేయనిస్తే చాలని అన్నారు. తన కాళ్లను కిందికి లాగే వాళ్లు లేకుంటే చాలని చెప్పారు. 

Also Read: అమితాబ్‌ బచ్చన్‌ `కేబీసీ` షోలో రియల్‌ హీరో.. గెస్ట్ గా సోనూసూద్‌ సందడి

మాల్వికా సూద్ ఏ పార్టీలో చేరుతున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. పార్టీ ముఖ్య విషయం కాదని, కానీ, ఆమె పాలసీ ముఖ్యమని వివరించారు. తన సోదరి సమాజానికి సేవ చేస్తుందని తెలిపారు. ప్రజలు తన సోదరికి మద్దతు ఇవ్వాలని చెప్పారు. అదే తరుణంలో ప్రస్తుత రాజకీయ పార్టీల్లో ఆప్, కాంగ్రెస్ రెండూ మంచి పార్టీలని అన్నారు. సోనూసూద్ గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు దేశ్ కే మెంటర్ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరించారు. ఇటీవలే ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సమావేశమయ్యారు. త్వరలోనే సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌నూ కలువనున్నట్టు వివరించారు.

తనపై జరిగిన ఐటీ దాడుల గురించీ విలేకరులు ప్రశ్నించారు. అది పరీక్షా కాలమని సోనూసూద్ అన్నారు. కానీ, అలాంటి దాడులు తన సర్వీస్‌నూ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. అంతేకాదు, త్వరలోనే తమ టీమ్ పేషెంట్లకు ఉచిత డయాలసిస్ కూడా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నదని వెల్లడించారు.

Also Read: రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి.. వద్దన్నా.. సోనూసూద్ వెల్లడించిన సంచలన విషయాలివే..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్దపెట్టున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా పంజాబ్ నుంచే ఎక్కువగా ఉన్నారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీలో వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల ప్రభావం పంజాబ్‌లో అత్యధికంగా ఉన్నది. అలాంటి రైతు ఆందోళనలపై సోనూసూద్ వైఖరిని కోరగా.. తాను రైతులకే మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. రైతులకు వారి హక్కులను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వారు పండిస్తేనే అందరూ కడుపు నిండా తింటున్నారని చెప్పారు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రముఖులకు అందజేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్‌కు పద్మ శ్రీ ఇచ్చిన కొన్నాళ్లకే ఆమె స్వాతంత్ర్యంపై నోరుపారేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఇదే తరుణంలో కొవిడ్ సమయంలో ఎంతో సేవలు అందించిన సోనూసూద్‌కు ఎందుకు పద్మ శ్రీ అవార్డు రాలేదన్న చర్చ కూడా జరిగింది. సోనూసూద్‌కు పద్మ శ్రీ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిగణించలేదనే ప్రశ్న విలేకరుల వేయగా.. ఇది ఆలోచించదగ్గ ప్రశ్నే అని సమాధానమిచ్చారు.

click me!