
మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతితో బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలు (violence) చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమరావతి (Amravati) నగరంలో నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ విధించినట్టుగా వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. త్రిపురలో ఇటీవల హింసాకాండ చోటుచేసకుందనే ప్రచారం నేపథ్యంలో అమరావతిలో శుక్రవారం రోజున మస్లిం వర్గాలకు (Muslim organizations) చెందిన వారు ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు శనివారం బంద్ చేపట్టారు. ఈ క్రమంలో దుకాణాలపై రాళ్ల దాడులు (mob hurled stones at shops) చోటుచేసున్నాయి.
ఈ నేపథ్యంలోనే హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోసే ఎలాంటి పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నగరంలో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సేలవను (Internet services) నిలిపివేస్తున్నట్టుగా నగర పోలీస్ కమిషనర్ ఆర్తీ సింగ్ (Arti Singh) తెలిపారు. శనివారం విధించిన కర్ఫ్యూ నాలుగు రోజులు పాటు అమలులో ఉంటుందని ఆమె ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ మినహా ఇతర సేవలను అనుమతించడం లేదని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి అనుమతి లేదని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట చేరడానికి కూడా అనుమతి లేదని పేర్కొన్నారు.
త్రిపురలో చోటుచేసుకున్న ఘటనలకు నిరసనగా ముస్లిం సంఘాలు శుక్రవారం అమరావతి, నాందేడ్, మాలెగావ్, వాషమ్, యవత్మాల్ ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీల సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు త్రిపురలో మైనార్టీ వర్గాలపై దౌర్జనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం Amravati జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. వారు అక్కడ మొమోరాండం సమర్పించి వెళ్తుండగా.. కొత్వాలి పోలీస్ స్టేషన్, కాటన్ మార్కెట్ మధ్య మూడు చోట్ల రాళ్ల దాడి జరిగింది.
ఇందుకు నిరసనగా స్థానిక బీజేపీ నేతలు శనివారం బంద్ నిర్వహించారు. రాజ్‌కమ్ చౌక్ (Rajkamal Chowk) ప్రాంతంలో వందలాది మంది ప్రజలు తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని, నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. అయితే వీరిలో కొందరు రాజ్‌కమల్ చౌక్, ఇతర ప్రదేశాలలో దుకాణాలపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు నిరసన కారులపై లాఠీచార్జ్ చేసినట్టుగా ఓ పోలీసు అధికారి తెలిపారు. శుక్ర, శనివారాల్లో చోటుచేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144(1), (2), (3) కింద అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి, ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాకాండలు మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఉన్నాయని అన్నారు. హింసకు పాల్పడిన వారు ఎవరనేది త్వరలోనే బయటపెడతామని చెప్పారు.‘రాష్ట్రంలో హింస పెరిగిపోతుందని ప్రతిపక్షాలు రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖలు రాస్తారు. ఇలాంటివి భవిష్యతుల్లో కూడా జరుగుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంది’ అని Sanjay Raut పేర్కొన్నారు.
మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్ మాట్లాడుతూ.. కొందరు సంఘ వ్యతిరేకులు దుకాణాలపై రాళ్లు రువ్వుతూ.. ప్రశాంత వాతావారణాన్ని చెడగొట్టాడనికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హింసను అదుపు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. అయితే దీని వెనకాల కొందరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని కోరారు.
ఇదిలా ఉంటే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. త్రిపురలో జరగని సంఘటన కోసం రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహించడం సరికాదని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఏ మతస్థలాన్ని తగలబెట్టలేదని త్రిపుర ప్రభుత్వం, స్థానిక పోలీసులు స్పష్టం చేశారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా వారు విడుదల చేసినట్టుగా చెప్పారు. సంయమనం పాటించాలని తాను ఇరు వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానని Devendra Fadnavis పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డీజీపీ హెచ్చరించారు. పౌరులు శాంతి, సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మత విద్వేషాలకు దారితీసే (ధ్రువీకరించని సమాచారం) వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ గానీ, పోస్ట్ గానీ చేయవద్దని కోరింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.