
మధ్యప్రదేశ్‌లోని టీకమగఢ్ జిల్లాలో ఓ గ్రామంలో ఇద్దరు కొడుకుల మధ్య తండ్రి అంత్యక్రియల విషయంలో గొడవ జరిగింది. ఇద్దరూ తండ్రికి చితికి నిప్పు పెట్టాలని పట్టుబట్టారు. ఎవరూ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరించారు. శవాన్ని రెండు ముక్కలు చేసి, విడివిడిగా అంత్యక్రియలు చేద్దామనే వరకు వెళ్ళింది.
జతారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరవింద్ సింగ్ డాంగీకి శవాన్ని ముక్కలు చేసి, విడివిడిగా అంత్యక్రియలు చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాల వాదనలు విన్నారు. వారి తండ్రి చివరి కోరిక ఏమిటో తెలుసుకున్నారు. స్థానిక పెద్దలు కూడా ఇద్దరు కొడుకులను సముదాయించి వివాదాన్ని తీర్చారు.
84 ఏళ్ల ధ్యానీ సింగ్ ఘోష్ ఆదివారం అనారోగ్యంతో మరణించారు. చివరి రోజుల్లో ఆయన చిన్న కొడుకు దేశ్‌రాజ్‌తో కలిసి ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలియగానే పెద్ద కొడుకు కిషన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. తానే పెద్దవాడినని, తానే అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టాడు. చివరి వరకు తండ్రికి సేవ చేసిన చిన్న కొడుకు, తానే చితికి నిప్పు పెడతానని అన్నాడు.
చిన్న కొడుకు కిషన్ మాట వినకపోవడంతో, మద్యం మత్తులో ఉన్న కిషన్ శవాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్ చేశాడు. దానిపై నిర్ణయం తీసుకునేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించి, వివాదాన్ని పరిష్కరించారు. చివరికి చిన్న కొడుకు చితికి నిప్పు పెట్టాడు. పెద్ద కొడుకు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.