Lok Sabha: దక్షిణాదిపై జాతీయ నాయకుల చూపు?.. వ్యూహం అదేనా?

By Mahesh K  |  First Published Dec 18, 2023, 7:47 PM IST

సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఓ తీర్మానం చేసింది. ఇది వరకే దక్షిణాది రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా తమిళనాడుకు చెందిన రామేశ్వరం నుంచి పోటీ చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీల వ్యూహం ఏమిటనే చర్చ మొదలైంది.
 


Sonia Gandhi: జాతీయ పార్టీలు దక్షిణాదిపై ఫోకస్ పెంచుతున్నాయి. ఉభయ జాతీయ పార్టీలు.. అది బీజేపీ అయినా... కాంగ్రెస్ అయినా.. వాటికి ఎక్కువగా ఉత్తరాదిలోనే ఆదరణ కనిపిస్తుంది. అందుకే జాతీయ పార్టీల అగ్రనేతలు ఎక్కువగా ఉత్తరాది లోక్ సభ స్థానాలకే ప్రాతినిధ్యం వహించడం మనం చూస్తాం. దక్షిణాదిలో మరో సీన్ ఉంటుంది. ఉత్తరాదిలో జాతీయ పార్టీల హవా ఉంటే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇటీవల జాతీయ పార్టీలు దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సారి తమిళనాడుకు చెందిన రామేశ్వరం నుంచీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో యూపీలో ఓడిపోయి దక్షిణాది రాష్ట్రం కేరళ నుంచి గెలిచారు. ఇప్పుడు కొత్తగా సోనియా గాంధీ పేరు కూడా తెర మీదికి వచ్చింది.

బీజేపీ వ్యూహం ఏమిటీ?

Latest Videos

ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. రెండు సార్లు బంపర్ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందులో చాలా సీట్లు ఉత్తరాదిన గెలుచుకున్నవే. ఈ సారి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోడీ వేవ్ ఉన్నది కాబట్టి, ఈ డ్యామేజీ కొంచెం స్వల్పంగా ఉండొచ్చు. కానీ, ఆ భర్తీని పూడ్చుకోవడానికి బీజేపీకి దక్షిణాది ముఖ్యం. అందుకే మోడీ ఈ సారి వారణాసితోపాటు మరో ఆధ్యాత్మిక ప్రాంతమైన తమిళనాడుకు చెందిన రామేశ్వరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. రామేశ్వరానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాంకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చింది బీజేపీనే. అలాగే.. తమిళనాడులో ఎప్పటినుంచో ఉనికిని చాటుకోవాలనే ఆశతో ఉన్న బీజేపీకి.. మోడీ అక్కడి నుంచి పోటీ చేయడం కలిసివస్తుందనీ అంచనాలు వేసుకున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. 

Also Read: Congress: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం

కాంగ్రెస్ వ్యూహం ఏమిటీ?

ఉత్తరాదిలో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నది. ముఖ్యంగా యూపీలోనూ బలమైన గాలి ఉన్నది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బలమైన కంచుకోటలు అనే పేరున్న రాయ్ బరేలీ, అమేథీల్లోనూ ఎదురుగాలి వీస్తున్నది. ఇది గమనించే గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతోపాటు వయానాడ్‌లోనూ పోటీ చేశాడు. కాంగ్రెస్ భయపడినట్టే అమేథీలో ఓడిపోయాడు. కానీ, మలయాళీలు అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఇదే ఆలోచనల్లో ఉన్నట్టు అర్థం అవుతున్నది.

రాయ్ బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్‌ బలం క్రమంగా క్షీణిస్తున్నది. అమేథీలో రాహుల్ గాంధీ 2004లో 66.18 శాత ఓటు షేరుతో, 2009లో 71.78 శాతం ఓటు షేరుతో మంచి మెజార్టీతో గెలిచారు. అదే 2014లో పరిస్థితులు మారాయి. రాహుల్ గాంధీకి 46.71 శాతం ఓటు షేరు రాగా.. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి 34.38 శాతం ఓటు షేరు వచ్చింది. 2019లో ఇరానీకి 49.71 శాతం ఓటుషేరుతో గెలవగా.. రాహుల్ గాంధీకి 43.84 శాతం ఓటు షేరు వచ్చింది. అదే వయానాడ్‌లో 64.94 ఓటు శాతంతో మంచి మెజార్టీతో గెలిచాడు.

Also Read: Parliament Sessions: సింగిల్ డేలో 78 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్.. మొత్తం 92 మందిపై వేటు

రాయ్ ‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. 2004లో సోనియా గాంధీకి 58.75 శాతం, 2009లొ 72.23 శాతం, 2014లో 63.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో ఇది 55.80 శాతానికి తగ్గింది. దీంతో 2024లో మరో సేఫ్ ప్లేస్ కోసం కూడా కాంగ్రెస్ ఆలోచించి ఉండొచ్చు. అంటే రాయ్‌బరేలీతోపాటు తెలంగాణ నుంచీ ఆమె పోటీ చేయొచ్చు.

ఈ పాయింట్‌కు తోడు..కాంగ్రెస్‌కు ఉత్తరాది కంటే దక్షిణాది వైపు ఆదరణ పెరుగుతున్నది. ఇక్కడి నుంచి అగ్రనేతలు పోటీ చేసి దాన్ని మరింత ఉధృతం చేయవచ్చనే వ్యూహం కూడా ఉన్నది.

click me!