తమిళనాడుకు కేంద్రం నిధులపై ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. నిధులు పెంచినా కొందరు ఫిర్యాదు చేస్తున్నారని మోదీ విమర్శించగా, నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు అన్యాయం జరగకుండా చూడాలని స్టాలిన్ కోరారు.
రామేశ్వరం (ఏప్రిల్ 8): తమిళనాడుకు కేంద్ర నిధులను తగ్గించారని పలుసార్లు ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. ‘ఎక్కువ కేటాయింపులు చేసినా కొందరు నిధుల కోసం ఏడుస్తారు’ అని ఎద్దేవా చేశారు.
తమిళనాడులోని రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘తమిళనాడు మౌలిక సదుపాయాలు ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత. గత కాలంతో (యూపీఏ కాలంతో) పోలిస్తే 2014 నుంచి తమిళనాడుకు కేంద్ర నిధులు 3 రెట్లు పెరిగాయి’ అన్నారు.
ఇదే సమయంలో రైల్వే నిధుల గురించి మాట్లాడుతూ, ‘గత దశాబ్దంలో రాష్ట్ర రైల్వే బడ్జెట్ 7 రెట్లు పెరిగింది. 2014కు ముందు తమిళనాడుకు ఏడాదికి రూ.900 కోట్లు మాత్రమే కేటాయించేవారు. కానీ ఈ ఏడాది రాష్ట్ర రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లు దాటింది. కేంద్ర ప్రభుత్వం రామేశ్వరంలోని రైల్వే స్టేషన్‌తో సహా తమిళనాడు వ్యాప్తంగా 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కొందరు కారణం లేకుండానే ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు’ అని విమర్శించారు.
అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతున్న ప్రయాణంలో తమిళనాడు కీలక స్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ దేశం మొత్తం పురోగతి వేగవంతం అవుతుందని చెప్పారు.
మోదీ పునర్విభజన ఆందోళన తొలగించాలి: స్టాలిన్
ఊటీ(త.నాడు): ప్రతిపాదిత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తమిళనాడు ప్రజల ఆందోళనను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కోరారు.
పర్యాటక ప్రాంతమైన ఊటీలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడులోని స్థానాలు తగ్గి అన్యాయం జరగకూడదు. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంట్ స్థానాల సంఖ్యను తగ్గిస్తుంది. దీనిని ప్రశ్నించడం మా హక్కు అని అన్నారు.
పాండిచ్చేరితో కలిపి తమిళనాడులో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మా గొంతు నొక్కాలని చూస్తోంది. జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని ప్రధాని హామీ ఇవ్వాలని అన్నారు.
తమిళనాడులోని స్థానాలను తగ్గించబోమని మోదీ బహిరంగంగా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇప్పటి రూపంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడుకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22న చెన్నైలో సంయుక్త కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే.