
ప్రపంచంలోనే మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య విద్యా సంస్థగా పేరుగాంచిన శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) మరో జాతీయ స్థాయి మైలురాయిని అధిగమించింది. వైద్య సేవల నాణ్యతలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను ఈ సంస్థకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (NABH) నుండి 'ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్' లభించింది.
భారతదేశంలో సుమారు 80 నుండి 90 వేల ఆసుపత్రులు ఉండగా, వాటిలో కేవలం 1.4 శాతం మాత్రమే పూర్తి స్థాయి NABH గుర్తింపు కలిగి ఉన్నాయి. కేవలం 3 శాతం ఆసుపత్రులు మాత్రమే ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉచితంగా సేవలు అందించే ఒక గ్రామీణ వైద్య సంస్థ ఈ గుర్తింపు పొందడం విశేషమని సంస్థ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ పేర్కొన్నారు.
NABH గుర్తింపు లభించడం అంటే ఆ ఆసుపత్రి ఈ క్రింది ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నట్లు.
రోగుల భద్రత: రోగులకు అందించే చికిత్సలో పటిష్టమైన భద్రతా విధానాలు ఉండటం.
ఇన్‌ఫెక్షన్ నియంత్రణ: ఆసుపత్రి వాతావరణంలో వ్యాధులు ప్రబలకుండా సమర్థవంతమైన వ్యవస్థలు పనిచేయడం.
నైతిక విలువలు: పారదర్శకమైన,బాధ్యతాయుతమైన వైద్య సేవలు అందించడం.
ప్రామాణిక విధానాలు: వైద్య, పరిపాలనా వ్యవహారాల్లో జాతీయ స్థాయి డాక్యుమెంటేషన్, పర్యవేక్షణ ఉండటం.
సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఈ సంస్థ, సామాజిక-ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
"ఈ ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్ మా ప్రస్థానంలో తొలి అడుగు మాత్రమే. త్వరలోనే పూర్తి స్థాయి NABH గుర్తింపును కూడా సాధిస్తాం" అని డాక్టర్ పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు.
ఈ గుర్తింపు కేవలం రోగులకే కాకుండా, ఇక్కడ చదువుతున్న వైద్య విద్యార్థులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాలు (SOPs), రోగి కేంద్రీకృత సేవా నమూనాలపై వారికి ప్రాక్టికల్ శిక్షణ లభిస్తుంది. దీనివల్ల రేపటి తరం వైద్యులు మరింత నైపుణ్యంతో, సేవా దృక్పథంతో తయారవుతారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాల విషయంలో వెనుకబడి ఉంటాయనే అపవాదును SMSIMSR చెరిపివేసింది. ఉచిత సేవలు అందిస్తూనే, జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించవచ్చని నిరూపిస్తూ.. ఈ సంస్థ నేడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు దిక్సూచిగా నిలుస్తోంది.