ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం..

By Sumanth KanukulaFirst Published Dec 8, 2022, 11:23 AM IST
Highlights

ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన దళితులను షెడ్యూల్డ్ కుల హోదాను పొందేందుకు అనుమతించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక "లోపభూయిష్టంగా" ఉన్నందున దానిని ఆమోదించలేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

క్రిస్టియన్, ఇస్లామిక్ సమాజాలలో అంటరానితనం ప్రబలంగా లేదని..  క్రైస్తవ మతం, ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. ‘‘రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులం) ఆర్డర్, 1950.. క్రిస్టియన్ లేదా ఇస్లామిక్ సమాజంలోని సభ్యులు అటువంటి వెనుకబాటు లేదా అణచివేత ఎన్నడూ ఎదుర్కోలేదని స్పష్టంగా నిర్ధారించిన చారిత్రక డేటా ఆధారంగా రూపొందించబడింది’’ అని తెలిపింది. 

మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ ఎస్సీ హోదా ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు‌లో విచారణ జరుగుతుంది. క్రైస్తవ, ముస్లిం దళితులను షెడ్యూల్డ్ కులాల జాబితా నుంచి మినహాయించడం వివక్షతో కూడుకున్నదని పిటిషన్లు వాదించాయి. అయితే ప్రస్తుతం రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ప్రకారం హిందువులు, సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులు మాత్రమే ఎస్సీలుగా వర్గీకరించబడతారు.

బుధవారం జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా హాజరయ్యారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కొత్త కమిషన్‌ను కేంద్రం నియమించిందని చెప్పారు. అయితే కొత్తగా నియమించబడిన కమిషన్ నివేదిక కోసం వేచి ఉండాలా? లేదా?.. ఇప్పటికే రికార్డులో ఉన్న అంశాల ఆధారంగా ముందుకు సాగాలా? వద్దా? అని మొదట నిర్ణయిస్తామని జస్టిస్ ఎస్‌కే కౌల్ ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

click me!