Safest cities in India: దేశంలో అత్యంత సురక్షిత‌మైన న‌గ‌ర‌మేదో తెలుసా..?

By Mahesh Rajamoni  |  First Published Dec 7, 2023, 7:05 PM IST

NCRB report: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలోని వివిధ న‌గ‌రాల్లో చోటుచేసుకుంటున్న నేరాల‌కు సంబంధించిన రిపోర్టుల వివ‌రాల‌ను పంచుకుంటూ.. కోల్ క‌తాలో 2021లో ప్రతి లక్ష మందికి 103.4 కాగ్నిజబుల్ నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. దేశరాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు పేరుగుతున్నాయంది.


National Crime Records Bureau: మహానగరాల్లో ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ నేరాలు నమోదవుతున్న కోల్ కతా వరుసగా మూడో ఏడాది కూడా భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా అవతరించిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రచురించిన నివేదిక తెలిపింది. 2022లో ప్రతి లక్ష మందికి 86.5 కాగ్నిజబుల్ నేరాలు నమోదైన తూర్పు మహానగరం తరువాత పూణే (280.7) రెండో స్థానంలో ఉంది. ద‌క్షిణాది మ‌హాన‌గ‌ర‌మైన హైదరాబాద్ (299.2) దేశంలోని అత్యంత సుర‌క్షిత‌మైన న‌గ‌రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 

ఐపీసీ, ఎస్ఎల్ఎల్ (స్పెషల్ అండ్ లోకల్ లాస్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే నేరాలను కాగ్నిజబుల్ నేరాలు అంటారు. దేశంలోని వివిధ మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల్లో న‌మోదైన కాగ్నిజ‌బుల్ నేరాల కింద సుర‌క్షిత‌మైన న‌గ‌రాల జాబితాను రూపొందించారు. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాలను పోల్చిచూసి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. అయితే కోల్‌కతాలో మహిళలపై నేరాలు పెరిగాయనీ, 2021లో కేసుల సంఖ్య 1,783 నుంచి 2022 నాటికి 1,890కి పెరిగిందని నివేదిక పేర్కొంది. మొత్తంగా కోల్‌కతాలో 2021లో లక్ష మందికి 103.4 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అది 86.5కి పడిపోయింది. 2020లో ఈ సంఖ్య 129.5గా ఉంది. కాగా, ప్రస్తుతం 83 పోలీస్ స్టేషన్లు కోల్‌కతా పోలీసు పరిధిలో ఉన్నాయి. 83లో తొమ్మిది మహిళా పోలీస్ స్టేషన్లు కాగా, రెండు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, ఎస్టీఎఫ్ ఉన్నాయి.

Latest Videos

దేశంలో సుర‌క్షిత‌మైన న‌గ‌రాల్లో మొద‌టి స్థానంలో కోల్ క‌తా ఉండ‌గా, రెండు మూడు స్థానాల్లో పూణే, హైద‌రాబాద్ లు ఉన్నాయి. 2021లో ల‌క్ష జ‌నాభాకు పూణే 256.8 కాగ్నిజ‌బుల్ నేరాలు, హైద‌రాబాద్ లో 259.9 నేరాలు నమోదయ్యాయి.  ఈ జాబితాలో చెన్నై నాలుగో స్థానంలో ఉంది. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) పంచుకున్న డేటా ప్రకారం.. రోజుకు సగటున మూడు అత్యాచారాలతో, ఢిల్లీ ఇప్పటికీ దేశంలో మహిళలకు అత్యంత అసురక్షిత మెట్రోపాలిటన్ నగరాలలో ఒకటిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. 2022 లో మహిళలపై 14,158 నేరాలు నమోదయ్యాయి. 2021లో మహిళలపై నమోదైన 13,982 నేరాలతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది.

click me!