దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ విజయం దక్కించుకుంది.
న్యూఢిల్లీ:దేశంలోని ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటర్లు పట్టం కట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, మిజోరంలో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ అధికారాన్ని దక్కించుకుంది. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది.దేశంలోని ప్రధానమైన మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది.
చత్తీస్‌ఘడ్ లో కలిసొచ్చిన బీజేపీ వ్యూహం
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బీజేపీ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి కలిసి వచ్చింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మహిళలు, గిరిజన ఓటర్లు బీజేపీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.మహిళలకు ఆర్ధిక సంబంధమైన ప్రయోజనం కల్గించే మహతారి వందన్ యోజన ప్రోగ్రాం బీజేపీ విజయంలో కీలకంగా మారింది. చత్తీస్ ఘడ్ ఎన్నికల సమయంలో మహతారి వందన్ యోజన పథకం గురించి బీజేపీ ప్రకటించింది. ఈ పథకం కింద వివాహమైన ప్రతి మహిళకు రూ. 1000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కాంగ్రెస్ ను దెబ్బతీసింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడంతో ఈ పథకం దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరో వైపు గిరిజనులు కూడ బీజేపీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మహిళా ఓటర్లు భారతీయ జనతా పార్టీ విజయంలో కీలకంగా పనిచేశారు.2018లో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 74 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2023 నాటికి మహిళలు 76 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేసింది. బొగ్గు, లిక్కర్ , డీఎంఎఫ్ ఫండ్, పీఎస్‌సీ స్కాం రిక్రూట్ మెంట్ స్కాం లలో అవినీతి విషయమై భగేల్ పై బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.ఈ అవినీతి విషయమై రాష్ట్రంలో జరిగిన ఆందోళనలు కూడ బీజేపీ నేతలు ప్రస్తావించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భగేల్ పై అవినీతి ఆరోపణలను ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీల కంటే బీజేపీ ఎన్నికల హామీల్లో మహిళలకు ఆర్ధిక సహాయం కలిసి వచ్చింది. ఈ అంశం కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో మట్టికరిపించింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందున్న పరిస్థితి క్రమంగా మారిపోయింది. బీజేపీకి అనుకూలంగా మారింది. ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చింది.
ఛత్తీస్‌ఘడ్ లో నిరుపేద కుటుంబాలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సహాయం బీజేపీకి కలిసి వచ్చింది.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్న అంశాలపై పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేసిన ప్రయత్నాలు ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ విజయానికి దోహదపడ్డాయి.గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ కు అనుమతి ఇవ్వడం భగేల్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. గిరిజన ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో భగేల్ సర్కార్ వైఫల్యం చెందింది.దీంతో ఈ ప్రాంతంలో ఓటర్లు బీజేపీ వైపునకు మొగ్గు చూపారు.వరికి మద్దతు ధరను పెంచింది. కానీ మోడీ సర్కార్ వరికి మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ మరింత మెరుగ్గా ఉంది.ఇది కూడ బీజేపీకి కలిసి వచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం కూడ కాంగ్రెస్ ను దెబ్బతీసింది.
మధ్యప్రదేశ్ లో సంక్షేమ పథకాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాడ్లీ బ్రహ్మణ యోజన కు మహిళా ఓటర్ల నుండి మంచి స్పందన లభించింది. ఈ పథకం కింద ప్రతి నెల మహిళలకు రూ. 1250 నగదును అందిస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఈ నగదును రూ. 3 వేలకు పెంచుతామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.ఈ హామీ మహిళా ఓటర్లను ఆకట్టుకుంది.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం తరహలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడ మహిళా ఓటర్లు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పరిణామం బీజేపీకి కలిసి వచ్చింది.2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో 74 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దఫా ఈ శాతం 76 శాతానికి చేరింది.మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీజేపీ ప్రకటించిన అంశాలు మహిళా ఓటర్లను ఆకర్షించాయి. ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ నేతృత్వంలోని సర్కార్ విధానాల కంటే రమణ్ సింగ్ అనుసరించిన విధానాలే మెరుగ్గా ఉన్నాయనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో మతఘర్షణలు చెలరేగిన సమయంలో భగేల్ సర్కార్ అనుసరించిన వైఖరి కూడ చర్చకు దారితీసింది. ఈ అంశం బీజేపీకి కలిసి వచ్చింది.
ప్రధాన మంత్రి మోడీ ప్రభావం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచారం బీజేపీ విజయానాకి దోహదపడింది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులను వెనక్కి నెట్టి బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండడానికి మోడీ ప్రచారం కలిసి వచ్చింది.శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రవేశ పెట్టిన పథకాలు కలిసి వచ్చాయి.2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ గా భావించారు.ఈ సెమీ ఫైనల్స్ లో బీజేపీ మంచి విజయాన్ని సాధించింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను బీజేపీ వైపునకు ఆకర్షించేలా ప్రయత్నించారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని 34 ఎస్టీ స్థానాల్లో బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించింది.కుల, మతాలకు అతీతంగా మోడీపై ప్రజలకు ఉన్న ఆదరణ ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మహిళా ఓటర్లు
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలకంగా పనిచేశారు. 26 మిలియన్ ఓటర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు రెండు శాతం అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మధ్యప్రదేశ్ లో విజయం పై పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయి నుండి కేంద్రీకరించింది. దీంతో బీజేపీకి కలిసి వచ్చింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేందుకు చేసిన ప్రయత్నాలు కలిసి వచ్చాయి.
రాజస్థాన్ లో కొంపముంచిన కాంగ్రెస్ నేతల అంతర్గత కుమ్ములాటలు
రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. రాజస్థాన్ లో ఆశోక్ గెహ్లాట్ ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. అయితే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఆ పార్టీ కొంపముంచింది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అదుపు చేయడంలో గెహ్లాట్ విఫలయ్యారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
రాజస్థాన్ రాష్ట్రంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న సచిన్ పైలెట్ కు చెక్ పెట్టేందుకు ఆశోక్ గెహ్లాట్ ప్రజల్లో బలం లేని వారికి టిక్కెట్లు కేటాయించారు.ఇది బీజేపీకి కలిసి వచ్చింది. ఆశోక్ గెహ్లాట్ సర్కార్ తీరును నిరసిస్తూ సచిన్ పైలెట్ దీక్షకు కూడ దిగారు. అవినీతికి వ్యతిరేకంగా తాను దీక్ష చేస్తున్న విషయాన్ని అప్పట్లో పైలెట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజస్థాన్ లో రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకేజీ కూడ బీజేపీకి కలిసి వచ్చింది. పేపర్ల లీకేజీపై బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఇదిలా ఉంటే సచిన్ పైలెట్ కు సీఎం పదవిని కాంగ్రెస్ ఇవ్వలేదు. ఆశోక్ గెహ్లాట్ సచిన్ పైలెట్ పట్ల అనుసరించిన తీరు కూడ బీజేపీకి కలిసి వచ్చింది.మరో వైపు పార్టీ రెబెల్స్ కూడ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారు.
మిజోరంలో అధికార పార్టీకి చుక్కలు చూపిన జోరాం పీపుల్స్ మూవ్ మెంట్
మిజోరంలో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ విజయం సాధించింది. అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. 40 అసెంబ్లీ స్థానాల్లో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ 27 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది.
నాలుగేళ్లలో మిజోరంలో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇందిరాగాంధీ వద్ద సెక్యూరిటీ ఆఫీసర్ గా లాల్దుహోమా పనిచేశారు. తర్వాతి కాలంలో లాల్దూహోమా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. మిజోరంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత జడ్ పీఎంకు కలిసి వచ్చింది.
తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ అధికారం
తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చేసిన ప్రచారం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడ ఈ ప్రచారాన్ని సమర్ధించేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత కూడ కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. మరో వైపు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆ పార్టీకి సానుకూలంగా మారాయి. తెలంగాణలో మార్పు రావాలని కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడ ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈ దఫా సీట్ల సంఖ్యను పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కామారెడ్డిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అనుముల రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణరెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టారు.