ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం మెరుగుపడిందనే చెప్పాలి. దీంతో మన దేశానికి అంతర్జాతీయ వేదికలపై తగిన గౌరవం దక్కుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రధాని మోదీని తమ దేశానికి మరోసారి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఎందుకో తెలుసా?
Russia Victory Day Parade 2025 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశ పర్యటనకు ఆహ్వానించారు. మే 9, 2025న మాస్కోలో జరిగే 80వ విక్టరీ డే పరేడ్ లో పాల్గొనాల్సిందిగా పుతిన్ కోరారు. అయితే ఇప్పటికే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే పుతిన్ ఆహ్వానం నేపథ్యంలో మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన చారిత్రాత్మక విజయం గుర్తుగా ఈ పరేడ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. విదేశీ అతిథులను ఆహ్వానికి వారి సమక్షంలో పరేడ్ నిర్వహిస్తారు. దేశాధ్యక్షుడు పుతిన్ తో సహా రష్యా అధికార యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.
విక్టరీ డే పరేడ్ రష్యాకు సైనిక ప్రదర్శన మాత్రమే కాదు, జాతీయ గౌరవం, త్యాగం యొక్క కథ. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మందికి పైగా రష్యన్లు చనిపోయారు. ఈ పరేడ్ ద్వారా దేశం తమ వీరులకు నివాళులర్పిస్తుంది.
విక్టరీ డే పరేడ్‌లో భారత్ పాల్గొనడం భారత్-రష్యా సంబంధాలకు గుర్తు. రెండు దేశాల మధ్య దశాబ్దాల నాటి సైనిక, వ్యూహాత్మక సహకారం ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్ ప్రాజెక్ట్, రక్షణ పరికరాల సరఫరా, ఇంధన భాగస్వామ్యం వంటి ముఖ్యమైన రంగాలలో భాగస్వామ్యం ఉంది.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శా వర్గాల ప్రకారం... ప్రధాని మోదీ ఈ ఏడాది చివర్లో రష్యాలో పర్యటించవచ్చు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ సహకారం, ఇంధనం వంటి ముఖ్యమైన రంగాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.