
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ మోడీ శుక్రవారం టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. రష్యా, భారత్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.
దౌత్య విధానాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నా.. ఉక్రెయిన్ తమ ప్రతిపాదనను నిర్ద్వందంగా నిరాకరించడాన్ని పుతిన్ మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్ చుట్టుపక్కల పరిస్ధితులపైనా ఇద్దరు నేతలు చర్చించారు. దీనితో పాటు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో), జీ20లో ఇరుదేశాల సహకారం గురించి కూడా మోడీ, పుతిన్ చర్చించారు. అలాగే బ్రిక్స్ ఫార్మాట్‌పై సహకారంపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లుగా ఇద్దరు నేతలు తెలిపారు.
ఇదే సమయంలో గత శనివారం వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ తిరుగుబాటును ఎదుర్కోవడంలో రష్యా నాయకత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యలకు గాను పుతిన్‌కు మోడీ మద్ధతు తెలిపారు. ప్రిగోజిన్ నేతృత్వంలోని ప్రైవేట్ కిరాయి సైన్యం తిరుగుబాటును నివారించిన వారం లోపే ఇద్దరు నేతల మధ్య టెలిఫోనిక్ సంభాషణ జరగడం విశేషం. వాగ్నర్ గ్రూప్ సైన్యం రష్యా దక్షిణ ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాలను ఆక్రమించింది. అయితే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో సాయంతో క్రెమ్లిన్ ఒప్పందం కుదుర్చుకోవడంతో మాస్కోకు వెళ్లలన్న తమ ఆలోచనను వాగ్నర్ గ్రూప్ విరమించుకుంది.
ఆ వెంటనే ప్రిగోజిన్ ఓ టెలిగ్రామ్ వీడియోలో.. రష్యన్ నాయకత్వాన్ని కుప్పకూల్చాలని తాను చెప్పలేదన్నారు. న్యాయం కోసం మార్చ్ చేపట్టామని తెలిపారు. అయితే వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు తర్వాత రష్యా అధ్యక్షుడు ఇకపై అజేయుడు కాదని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. పుతిన్ వాగ్నర్ తిరుగుబాటుకు మద్ధతుగా నిలిచినట్లు అనుమానిస్తున్న సీనియర్ సైనికాధికారులపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ఓ టాప్ జనరల్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానంగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించాలని కొందరు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఉక్రెయిన్ దండయాత్రలో రష్యా విజయం సాధించకపోవడంపై ప్రిగోజిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన అక్కసును షోయిగుపై బహిరంగంగానే వెళ్లగక్కారు. మిలిటరీ, వ్యాపారం, ఇతర సమూహాలతో కూడిన టెలివిజన్ పబ్లిక్ ఈవెంట్‌లతో కీలక నియోజకవర్గాలకు భరోసా ఇవ్వడానికి పుతిన్ చర్యలు తీసుకుంటున్నారు. పోల్స్‌లో అతనికి ప్రజల మద్దతు బలంగానే ఉన్నట్లు చూపించినప్పటికీ, ప్రభుత్వ, వ్యాపార ప్రముఖులలో అతని నియంత్రణపై సందేహాలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో పుతిన్ సంభాషించడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.