
మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. అబ్బాయి, అమ్మాయి మధ్య లైంగిక బంధం పెట్టుకోవడంలో ఏకాభిప్రాయానికి సంబంధించిన వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది . ప్రస్తుత యుగంలో పిల్లలు త్వరగా యవ్వనంగా మారుతున్నారని కోర్ట్ పేర్కొంది. దీనికి ఇంటర్నెట్ కూడా ముఖ్య భూమిక పోషిస్తోందని ధర్మాసనం తెలిపింది. అలాంటి పరిస్ధితుల్లో అతను/ఆమె వేసే అడుగులు కొన్నిసార్లు భవిష్యత్తును అంధకారంలో పడేస్తాయని కోర్ట్ పేర్కొంది.
ఎంతో మంది యువకులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సంబంధం కలిగి వుంటారని గుర్తుచేసింది. దీని కారణంగా పోలీసులు వారిపై పోక్సో చట్టం, అత్యాచారం వంటి నేరాలను నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. యవ్వనం, లైంగిక ఆకర్షణ కారణంగా చేసిన పొరబాట్ల కారణంగా వారు దోషులుగా మారుతున్నారని ధర్మాసనం తెలిపింది. అజ్ఞానంతో చేసే ఇలాంటి పనుల వల్ల యువకుల జీవితాలు అన్యాయమైపోతున్నాయని చెప్పింది. ఓ కేసు విషయంలో తీర్పు చెబుతూ ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రాహుల్ జాతవ్‌పై 14 ఏళ్ల బాలిక అత్యాచారం కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా రాహుల్‌ను 2020 జూలై 17న పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి రాహుల్ జైలు జీవితం గడుపుతున్నాడు. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, బాధిత బాలిక ఆరోపించిందని రాహుల్ తరపు న్యాయవాది రాజమణి బన్సాల్ కోర్టుకు తెలిపారు. జనవరి 18, 2020న బాధితురాలు కోచింగ్ కోసం రాహుల్ వద్దకు వెళ్లగా.. ఆమె వచ్చేసరికి మిగిలిన విద్యార్ధులు క్లాస్‌కు రాలేదు. ఈ సమయంలో కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌గా వున్న రాహుల్ జాతవ్ ఆమెకు జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన వెంటనే బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది. ఆపై రాహుల్ ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలు తీసి వాటి సాయంతో బాలికను లోబరచుకున్నాడు.
వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెను అనుభవించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. కేసు నమోదు తర్వాత కోర్ట్ అనుమతి మేరకు 2020 సెప్టెంబర్‌లో బాధితురాలికి అబార్షన్ చేశారు. ఇదే బాలిక మరో వ్యక్తిపైనా ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని దూరపు బంధువు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ కేసులో ఇరువురి అంగీకారంతోనే లైంగిక సంబంధం ఏర్పడిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. అలాంటి పరిస్థితిలో తన క్లయింట్ వారిద్దరి మధ్యలో చిక్కుకున్నాడని.. రాహుల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని బన్సాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్ట్.. రాహుల్ జాతవ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసింది. ఈ ఇంటర్నెట్ యుగంలో యుక్తవయస్సులో వున్న యువతలో పరస్పర సంబంధాలు ఏర్పరుచునేందుకు వారి వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. యువతకు అన్యాయం జరగకుండా ఈ విషయాన్ని సమీక్షించాలని సూచించింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ నిర్భయ సంఘటన తర్వాత పరస్పర సంబంధాల వయస్సును కేంద్రం 16 నుంచి 18కి పెంచిన సంగతి తెలిసిందే.