కుండపోత వర్షాలతో తమిళనాడు తల్లడిల్లుతున్నది. నిన్న రాత్రి కొంచెం తెరిపి ఇచ్చినా.. మళ్లీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు తీవ్ర వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. అందుకే చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
చెన్నై: Tamil Naduను వర్షాలు ముంచెత్తాయి. కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న Rainsతో ప్రజా జీవనం స్తంభించింది. ప్రభుత్వం సహాయక చర్యల్లో దిగింది. బోట్లు, Flood Water ఎత్తిపోయడానికి మోటార్ పంప్ సెట్లు, జెనరేటర్లను లోతట్టు ప్రాంతాలకు పంపింది. మొబైల్ కనెక్షన్ కట్ కాకుండా ఉండటానికి వీల్‌పై సెల్యులర్ టవర్‌లను ఏర్పాటు చేస్తున్నది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు నిన్న రాత్రి కొంత తెరిపినిచ్చాయి. అంటే కుండపోతగా కాకుండా స్వల్ప స్థాయిలో కురిశాయి. కానీ, మళ్లీ భారీగా కురిసే అవకాశమున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే చెన్నై సహా 20 జిల్లాల్లో Red Alert జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మళ్లీ అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యం వైపు కదులుతున్నదని, దీంతో తమిళనాడు ఉత్తర జిల్లాలో వర్షాలు భారీగా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్‌లో నేడు, రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశముంది.
Also Read: తమిళనాడులో భారీ వర్షాలు: ఈ నెల 11 వరకు రెడ్ అలర్ట్, భయాందోళనలో ప్రజలు
2015 తర్వాత అత్యధిక వర్షాలు కురవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో కురిసే సగటు వర్షపాతాని కంటే 46శాతం అత్యధికంగా కురిశాయి. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. వర్ష సంబంధ ఘటనల్లో కనీసం ఐదుగురు మరణించారు. కనీసం 530 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 1,700 మంది తాత్కాలిక సహాయక శిబిరాలకు చేరాల్సి వచ్చింది. వర్షాల కారణంగా చెన్నై సహా తొమ్మిది జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్లకు రెండు రోజులపాటు అంటే రేపటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన చెన్నై సహా పలు ప్రాంతాలను సీఎం ఎంకే స్టాలిన్ పర్యటించారు. బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో సహకరించారు. సహాయక చర్యల కోసం అధికారులను అలర్ట్ చేశారు.
వచ్చే రెండు రోజుల్లో చెన్నైలో 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని గ్రేటర్ చెన్నై మున్సిపల్ అధికారులు తెలిపారు. వరదలను తొలగించడానికి ఇప్పటికే 507 మోటార్లను ఏర్పాటు చేశామని, ఇందులో 60 హెవీ డ్యూటీ పంప్ సెట్లు ఉన్నాయని వివరించారు. ఆహార పంపిణీకి, జెనరేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇతర మౌలిక వసతులూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటికే 53 పడవలను వరద ప్రాంతాలకు పంపామని పేర్కొన్నారు.
ఇప్పటికైతే చాలా తక్కువ ప్రాంతాలే వరద నీటిలో మునిగి ఉన్నాయని, చాలా వరకు వరద నీటిని తొలగించగలిగామని గ్రేటర్ చెన్నై కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ, డిప్యూటీ కమిషనర్ స్నేహలు వివరించారు. అయితే, మళ్లీ ఇవాళ, రేపు వర్షాలు కురిస్తే ఇప్పటి వరకు శ్రమ పడి వరద నీటిని తోడేసిన ప్రాంతాలు మరోసారి నీట మునిగే అవకాశముందనీ అన్నారు.
ఇప్పటి వరకు 169 సహాయక శిబిరాలు నడుస్తున్నాయని, మొత్తం 400 ప్రాంతాల్లో 2016 ప్రాంతాల్లో వరదలు తొలగించామని వివరించారు. అంతేకాదు, 16 సబ్‌వేలలో 14 సబ్‌వేలలో వరద నీటిని తొలగించామని చెప్పారు. అమ్మ క్యాంటీన్‌లలో ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని, చెన్నై కార్పొరేషన్ ఆహారాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఆపద సమయంలో సహాయం కోసం తమిళనాడు గవర్నమెంట్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడానికి 1070 నెంబర్‌కు జిల్లా కంట్రోల్ రూమ్ కోసం 1077, చెన్నై కంట్రోల్ రూమ్ కోసం 1913 నెంబర్‌లకు కాల్ చేయవచ్చు.