మహారాష్ట్ర మాజీ సీఎంకు దావూద్ అనుచరుడితో సంబంధాలు.. మంత్రి నవాబ్ మాలిక్ ‘హైడ్రోజన్ బాంబ్’

By telugu teamFirst Published Nov 10, 2021, 12:59 PM IST
Highlights

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ప్రతిపక్ష బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడితో దేవేంద్ర ఫడ్నవీస్‌కు సంబంధాలున్నాయని, నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టవ్వగానే వెంటనే విడిచిపెట్టారని చెప్పారు. ప్రధాన మంత్రి పాల్గొన్న బీజేపీ కార్యక్రమాల్లోకీ దావూద్ అనుచరుడు సులువుగా వెళ్లగలిగేవారని అన్నారు. 

ముంబయి: ఎన్‌సీపీ నేత, Maharashtra మంత్రి Nawab Malikకు Underworldతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Devendra Fadnavis నిన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంబంధాలతోనే ఆయన ఆస్తులను కొనుగోలు చేశారనీ ఆరోపించారు. వీటిపై నిన్ననే నవాబ్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కే అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయని అన్నారు. ఈ సంబంధాలపై గురువారం ఉదయమే Hydrogen Bomb పేలుస్తానని తెలిపారు.

నవాబ్ మాలిక్ అన్నట్టుగానే ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను పేలుస్తానన్న ‘బాంబు’నూ పేల్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కే అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయని అన్నారు. అండర్‌వరల్డ్ డాన్ Dawood Ibrahim అనుచరుడు రియాజ్ భాతితో సాన్నిహిత్యం ఉన్నదని ఆరోపించారు. ‘రియాజ్ భాతి ఎవరు? నకిలీ పాస్‌పోర్టుతో ఆయన పోలీసులకు చిక్కాడు. ఆయనకూ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నాయని అందరికీ తెలిసిందే. కానీ, పోలీసులు అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాతే ఆయనను విడిచి పెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? దానికి దేవేంద్ర ఫడ్నవీస్‌నే కారణం. రియాజ్ భాతి బీజేపీ కార్యక్రమాల్లోనూ ఎందుకు కనిపిస్తుంటారు?’ అని ప్రశ్నించారు.

Also Read: అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ కథ రేపు చెబుతా.. హైడ్రోజన్ బాంబే వేస్తా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్

‘ఈ వ్యవహారంలోకి ప్రధాన మంత్రిని లాగాలని భావించడం లేదు. కానీ, దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాతికి ప్రధానమంత్రి పాల్గొనే వేడుకల్లోకీ వెళ్లే సౌలభ్యం ఉంది. అంతేకాదు, ఆయనతోనూ ఫొటోలు దిగారు. విదేశాల్లోని అండర్‌వరల్డ్ డాన్‌లు దేవేంద్ర ఫడ్నవీస్ థానే పోలీసు స్టేషన్‌లో నియమించిన పోలీసు అధికారులకూ ఫోన్‌లు చేశారు. రియాజ్ భాతి మ్యాటర్ సెటిల్ అయిపోయింది’ అని ఆరోపణలు సంధించారు.

దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయాలను నేరపూరితం చేశారని మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో అడ్డగోలు నేరాలు జరిగాయని, నేరస్తులకు రక్షణ కల్పించారని తెలిపారు. అంతేకాదు, నేరస్తులకే పదవులూ ఇచ్చారని విమర్శించారు. నాగ్‌పూర్‌లో పేరుమోసిన నేరస్తుడు మున్నా యాదవ్‌ను నిర్మాణ కార్మికుల బోర్డుకు చైర్మన్‌గా దేవేంద్ర ఫడ్నవీస్ నియమించారని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్లో ప్రమేయమున్న హైదర్ ఆజామ్‌ను మౌలానా ఆజాద్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఫడ్నవీస్ నియమించారని పేర్కొన్నారు. 

Also Read: Devendra Fadnavis: నవాబ్ మాలిక్ అండర్ వరల్డ్ వ్యక్తుల నుంచి భూమి కొన్నాడు.. సంచలన ఆరోపణలు చేసిన ఫడ్నవీస్

అంతేకాదు, నకిలీ నోట్ల రాకెట్‌నూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు కాపాడుకు వచ్చారని నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు. ‘2016లో ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల నుంచి నకిలీ కరెన్సీని సీజ్ చేశారు అధికారులు. కానీ, అనూహ్యంగా మహారాష్ట్రలో ఏడాది పాటు ఒక్క కేసు కూడా బయటపడలేదు. ఎందుకంటే నకిలీ నోట్ల రాకెట్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆశీస్సులతో నిరాటంకంగా తన పని చేసుకుంది. దీనికి అప్పుడు డీఆర్ఐలో పనిచేస్తున్న సమీర్ వాంఖడే సహకరించాడు. కానీ, 2017 అక్టోబర్ 8న రూ. 14.56 కోట్ల నకిలీ కరెన్సీని ముంబయి బీకేసీలో డీఆర్ఐ  సీజ్ చేసింది. కానీ, ఆ వ్యవహారాన్నీ ఫడ్నవీస్ పక్కనపెట్టేశారు. ఈ నకిలీ నోట్లు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కానీ, నిందితులకు వెంటనే బెయిల్ ఇచ్చారు. కనీసం ఆ కేసును ఎన్ఐఏకూ బదిలీ చేయలేదు. కానీ, ఆ వ్యక్తులు కాంగ్రెస్ సంబంధీకులనే ఆరోపణలు చేశారు. అరెస్టయిన వ్యక్తి హజీ అరాఫత్ షేక్ చిన్న తమ్ముడు. అరాఫత్ షేక్‌నే ఫడ్నవీస్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించారు’ అంటూ నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తే దానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను కేవలం న్యాయం కోసమే మాట్లాడుతున్నారని, ఎవరినీ టార్గెట్ చేయాలనే దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

click me!