క్షమాపణలు చెప్పుంటే ఇంత దూరం వచ్చేదా.. మధ్యలో అదానీకేం సంబంధం : రాహుల్‌కు బీజేపీ కౌంటర్

By Siva KodatiFirst Published Mar 25, 2023, 3:18 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కౌంటరిచ్చారు. క్షమాపణలు చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదని, రాహుల్ వ్యాఖ్యలకు, అదానీ అంశానికి సంబంధం లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటరిచ్చింది. రాహుల్ ప్రెస్‌మీట్‌లో చెప్పినవన్నీ అబద్ధాలేనని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. తాను ఏది మాట్లాడినా ఆలోచించే మాట్లాడుతానని రాహుల్ అన్నారని.. మరి 2019లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆలోచించే చేశారా అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దేశంలోని ఓబీసీలను కించపర్చేలా రాహుల్ మాట్లాడారని రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు.

వాక్ స్వాతంత్ర్యం వుంది కానీ, దూషించే హక్కు లేదని ఆయన హెచ్చరించారు. క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ చెప్పలేదని, అందుకే శిక్ష పడిందని రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నిస్తోందని ఆయన నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలకు, అదానీ అంశానికి సంబంధం లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో రాహుల్ గాంధీని ఒక్కరినే అనర్హుడిగా ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా 32 మందిపై అనర్హత వేటు పడిందని రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. 

ALso REad: మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్

అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై తాను పార్లమెంటులో ప్రశ్నలు అడిగానని చెప్పారు. రాహుల్ గాంధీ  లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆయన నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగం రద్దు చేయబడిందని అన్నారు.  తరువాత తాను లోక్‌సభ స్పీకర్‌కి వివరణాత్మక సమాధానం రాశానని చెప్పారు. కొంతమంది మంత్రులు తన గురించి అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను విదేశీ శక్తుల నుండి సహాయం కోరానని మాట్లాడుతున్నారని.. కానీ అలాంటిదేమి లేదని చెప్పారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని చెప్పారు. అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై మంత్రుల ఆరోపణలు, అనర్హత గేమ్ అని విమర్శించారు. 

అయితే తాను ప్రశ్నలు అడగడం ఆపనని.. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అదానీ షెల్‌ కంపెనీల్లో రూ. 20,000 కోట్లను ఎవరు పెట్టుబడిగా పెట్టారనేది ప్రశ్న అని.. ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటానని చెప్పారు. భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య స్వరాన్ని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని.. దానిని కొనసాగిస్తానని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు. తాను అదానీ సమస్యపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని.. అనర్హత వేటు వేసి జైల్లో పెట్టిన తనను భయపెట్టలేరని చెప్పారు. తాను వెనక్కి తగ్గనని చెప్పారు. 
 

click me!