రాజస్థాన్ రాష్ట్రంలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కమల దళం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజల ఇబ్బందులపై ప్రచారం చేస్తుంది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లో రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మోడీపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అర్జున్ మేఘువాల్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జునాగఢ్ నుండి రోడ్ షో ప్రారంభమైంది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ సాగారు. మోడీతో కొందరు స్థానికులు కరచాలనం చేశారు.
రోడ్ షో నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నిన్న రాష్ట్రంలోని రెండు ఎన్నికల సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఈ దఫా బీజేపీ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న హింస, అశాంతి, ఘర్షణలు, మహిళలపై దాడుల విషయాన్ని బీజేపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.