ఉక్రెయిన్‌తో రష్యా వ్యవహరించినట్టే.. భారత్‌తో చైనా విధానం.. సరిహద్దు ఘర్షణలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Jan 2, 2023, 4:26 PM IST
Highlights

ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి, సరిహద్దులో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణలకు మధ్య పోలికలను రాహుల్ గాంధీ చర్చించారు. ఉక్రెయిన్ పట్ల రష్యా అనుసరిస్తున్న వైఖరినే భారత్ పట్ల చైనా అనుసరిస్తున్నదని అన్నారు. కమల్ హాసన్‌తో ఆయన సంభాషిస్తూ కీలక విషయాలు చెప్పారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కమల్ హాసన్‌‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి.. భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణల్లో పోలికలు తీశారు. ఉక్రెయిన్‌తో రష్యా వ్యవహరించిన తీరులోనే భారత్‌తో చైనా వ్యవహరిస్తున్నదని అన్నారు. భారత్‌తో సరిహద్దును మార్చడానికి చైనా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ బలమైన సంబంధాలు పెట్టుకోవడాన్ని తాము అంగీకరించబోమని రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తున్నదని అన్నారు. మీరు చేస్తున్నవాటిని జాగ్రత్తగా చేయండి అని చైనా చెబుతున్నదని, ఎందుకంటే.. భారత భౌగోళిక పరిస్థితులను మార్చేయగలమని హెచ్చరిస్తున్నదని వివరించారు. తాము లడాఖ్‌లోకి రావొచ్చని, అరుణాచల్ ప్రదేశ్‌లోకీ రావొచ్చని చైనా చర్యలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

సరిహద్దు ఘర్షణలకు మన దేశ బలహీన ఆర్థిక వ్యవస్థ, ఒక విజన్ లేకపోవడం, విద్వేషం, కోపోద్రిక్తలకు సంబంధం ఉన్నదని వివరించారు. అందుకే చైనా ఇప్పుడు భారత సరిహద్దుల్లో కూర్చున్నదని తెలిపారు. ‘ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి చెప్పిందేమంటే.. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ బలమైన సంబంధాలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదు. ఉక్రెనియన్లు పశ్చిమ దేశాలతో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటే తాము ఆ దేశ భౌగోళిక స్థితిని మార్చేస్తాం’ ఇదే ఉక్రెయిన్‌కు రష్యా ఈ దాడుల ద్వారా చెప్పింది.

Also Read: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది.. కావాలంటే రాసిస్తా..: రాహుల్ గాంధీ

‘అదే ప్రిన్సిపుల్ ఇక్కడ భారత్‌కు కూడా వర్తిస్తుంది. మనం చేసే పనులపై జాగ్రత్త వహించాలని చైనా మనకు చెబుతున్నది. ఎందుకంటే మన భౌగోళిక స్థితిని మార్చేస్తామని హెచ్చరిస్తున్నారు. మేం లడాఖ్‌లోకి ఎంటర్ అవుతాం, అరుణాల్‌లోకి ప్రవేశిస్తాం, ఇలాంటి విధానం కోసమే చైనా ఒక ప్లాట్‌ఫామ్ తయారు చేసుకుంటున్నది’ అని రాహుల్ గాంధీ అన్నారు. కమల్ హాసన్‌తో చేసిన సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. ‘ఇక్కడ మనం యుద్ధానికి పోవడం కాదు. మనపై ఎవరు దాడి చేయని స్థితిని కలిగి ఉండటం. దీనికి మన దేశ ఆర్థిక వ్యవస్థ, విద్వేషం, గందరగోళం, సరిహద్దులో ఘర్షణలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి’ అని వివరించారు.

click me!