రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇద్దరు నేతల మధ్య కీలక అంశాలపై ఫోన్ సంభాషణ సాగినట్లు భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతును తెలిపారు.
అమాయక టూరిస్ట్ ల ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి మద్దతును తెలిపారు పుతిన్. ఈ దారుణ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారికి మద్దతుగా నిలిచివారిని శిక్షించాలని ఆయన నొక్కి చెప్పారు. ఇరువురు నాయకులు భారత్-రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని పునరుద్ఘాటించారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
విజయ్ దినోత్సవ 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వార్షిక సదస్సుకు పుతిన్ ను మోదీ ఆహ్వానించారు.
శనివారం ప్రధానమంత్రి మోడీ ఉగ్రవాదాన్ని మానవాళికి "అతిపెద్ద ముప్పు" గా అభివర్ణించారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులపై, వారి మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని మేమిద్దరం అంగీకరిస్తున్నాం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణనష్టంపై సంతాపం తెలిపినందుకు అంగోలా అధ్యక్షుడు లౌరెంకో, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలిపాను" అని అంగోలా అధ్యక్షుడు లౌరెంకోతో విస్తృత చర్చల తర్వాత మోడీ అన్నారు.
"ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. సరిహద్దు దాటి ఉగ్రవాదంపై మా పోరాటానికి అంగోలా మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు.