పంజాబ్ స్కూళ్లలో తెలుగు బోధన.. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. ఎందుకంటే?

Published : May 24, 2025, 08:51 PM IST
up teacher recruitment 2025 tgt pgt vacancy aided school bharti news

సారాంశం

Telugu language in Punjab schools: కేంద్ర ప్రభుత్వ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యా శాఖ తెలిపింది. అయితే, దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Telugu language in Punjab schools: పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు భాషను బోధించాలని పంజాబ్ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మే 26 నుండి జూన్ 5 వరకు జరుగనున్న"భారతీయ భాషా సమ్మర్ క్యాంప్"లో తెలుగును బోధించనున్నారు. అయితే, తెలుగు భాష బోధనపై పంజాబ్ లో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" పథకం కింద నిర్వహించబోయే ఈ క్యాంపులకు వ్యతిరేకంగా డెమోక్రాటిక్ టీచర్స్ ఫ్రంట్ (డీటీఎఫ్) నిరసన వ్యక్తం చేసింది.

తెలుగు బోధనపై నిరసనలు ఎందుకు? 

డీటీఎఫ్ ఈ కార్యక్రమాన్ని అశాస్త్రీయమైనది, అసాధ్యమైనది, విద్యా ప్రాధాన్యతలకు విరుద్ధమైనదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పదో తరగతిలో 1,571 మంది, ఇంటర్మీడియట్‌లో 3,800 మంది విద్యార్థులు పంజాబీ భాషలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో, మరో కొత్త భాష అయిన తెలుగును బోధించడాన్ని వారు విమర్శించారు. “విద్యార్థులు తాము మాట్లాడే భాషలోనూ తడబడుతున్నప్పుడు, నాల్గవ భాషను ఎందుకు బలవంతంగా బోధించాలి?” అని డీటీఎఫ్ ప్రతినిధి ప్రశ్నించారు.

ఈ క్యాంపులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు భాష ప్రాథమికాలు, పాటలు, వంటకాలు, నృత్యాలు, దేశభక్తి కార్యకలాపాలు బోధిస్తారు. పాఠశాలల పని దినాల్లో హాఫ్ డే విరామం తర్వాత, సెలవు రోజుల్లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. 75 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రతి విద్యార్థిని ఇందులో భాగం కావాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థి కోసం రూ.30 బడ్జెట్ కేటాయించారు.

పాఠశాలల ఉపాధ్యాయులు ఈ శిక్షణకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వీరు YouTube లింకులు, NCERT, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, సీఐఐఎల్ మైసూరు వంటి సంస్థల నుంచి ప్రింట్, డిజిటల్ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చు. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఒక్క బ్యాచ్ లేదా మూడు బ్యాచ్‌లు ఏర్పాటు చేయవచ్చు.

ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో.. డీటీఎఫ్ ప్రశ్నలు

సాంకేతికంగా చూసినప్పుడు, ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అనేక భారతీయ భాషలపై అవగాహన పెంచడానికి, సంస్కృతుల మధ్య ఐక్యతను ప్రోత్సహించడానికి, కొత్త భాషలో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినదిగా ఉంది. 

అయితే డీటీఎఫ్ సభ్యులు మాత్రం దీనిని రాష్ట్ర విద్యా వ్యవస్థపై భారంగా అభివర్ణించారు. "ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాఠశాలల్లో నాల్గవ భాష బోధన ద్వారా ప్రధాన విద్యా లక్ష్యాలు మరింత అస్తవ్యస్తం అవుతాయి" అని పేర్కొంటున్నారు. పైగా, విద్యార్థుల పంజాబీ భాషలోనే ప్రావీణ్యం లేకపోతే, మరొక భాషను బోధించడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. 

ఇతర భాషల బోధన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించు కోవాలి లేదా వాలంటరీగా మార్చాల‌ని ప్రభుత్వాన్ని డీటీఎఫ్ డిమాండ్ చేసింది. అలాగే పంజాబీ భాషలో విద్యార్థుల ప్రావీణ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని కోరింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !