PM Modi Security Lapse: అన్ని విచారణలు రద్దు.. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్డీ నేతృత్వంలో విచారణ కమిటీ..

By Sumanth KanukulaFirst Published Jan 10, 2022, 12:29 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫ్యంలో సుప్రీం కోర్టులో (Supreme Court) మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫ్యల్యం ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ  ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతన్న అన్ని విచారణలను నిలిపివేయాలని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చండీగఢ్‌ డీజీపీ (DGP Chandigarh), ఎన్‌ఐఏ ఐజీ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సభ్యులుగా ఉండనున్నారు. తాము ఆదేశించిన విచారణను కొనసాగించాలని కేంద్రం, పంజాబ్‌లోని ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. ఈ కమిటీలో పంజాబ్ నుంచి కూడ ప్రాతినిధ్యం ఉంటుందని సీజేఐ అన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సీజేఐ ధర్మాసనం వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనుంది.
 
ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనపై (PM Modi Security Lapse) విచారణ చేపట్టాలని కోరుతూ లాయర్స్ వాయిస్ (Lawyers Voice) అనే సంస్థ దాఖలైన  పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శుక్రవారం సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసం విచారణ చేపట్టగా..  ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్‌ అండ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

ఈ క్రమంలోనే సోమవారం ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

‘భద్రతలో లోపాలు ఉన్నాయి. అందులో ఎలాంటి వివాదం లేదు. సమాచారం సరిగా అందజేయలేదు. రోడ్డు క్లియర్‌గా ఉందనే సమాచారం ఉండాలి. ఏదైనా దిగ్భందనం ఉంటే కాన్వాయ్‌ను 4 కిలోమీటర్ల దూరంలో ఆపాలి. ఇది పూర్తిగా నిఘా వైఫల్యం. SPG చట్టం మరియు బ్లూ బుక్ ఉల్లంఘన జరిగితే.. అసలు వినాల్సిన అవసరం లేదు. అధికారులకు నోటీసులు జారీచేశారు. అయితే వారు కోర్టు ముందు హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వారిని కాపాడుతుందన్న వాస్తవాన్ని పరిశీలించాలి. షోకాజ్ నోటీసు ఆధారంగా నిబంధనల ప్రకారం డీజీ, ఇంటెలిజెన్స్ అధికారులదే బాధ్యత. రోడ్డు దిగ్భందనం గురించి ముందస్తు హెచ్చరిక ఏమి లేదు’ అని తుషార్‌ మెహతా సీజేఐ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. 

‘అవును ఉల్లంఘన జరిగిందని, పంజాబ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. విచారణ జరిగితే.. దాని పరిధి ఏమిటి అనేది ప్రశ్న. మీరు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటే.. ఈ కోర్టుకు ఏమి మిగిలి ఉంది’ అని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. 

జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ.. ‘మీరు ఇప్పటికే పంజాబ్ అధికారులది తప్పని పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మీకు ఎలా ముందుకెళ్లాలో తెలుసు. అలాంటప్పుడు కోర్టుకు ఎందుకు వచ్చారు’ అని తుషార్ మోహతాను ప్రశ్నించారు. 

విచారణ సందర్భంగా స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం సుప్రీ కోర్టును కోరింది. కేంద్రం వాదనలను తోసిపుచ్చింది. పంజాబ్ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ DS Patwalia వాదనలు వినిపించారు. కేంద్ర కమిటీపై నమ్మకం లేదని తెలిపారు. తమ అధికారులను ముందే దోషులుగా చిత్రీకరించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విచారణకు ముందు కేంద్రం నోటీసులు ఇచ్చిందని.. విచారణకు ముందే దోషులుగా చిత్రీకరించిందని అన్నారు. అభిప్రాయం చెప్పే అవకాశం లేకుండా నోటీసులు ఇచ్చారని చెప్పారు. కేంద్ర ఏజెన్సీల విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావని అన్నారు. దోషులుగా తెలితే తనను, అధికారులను ఉరి తీయాలని చెప్పారు. 

దీనిపై స్పందించి సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. దోషులుగా చిత్రించాక తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది.

click me!