
కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే మార్చి 11న ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో (modi gujarat visit) పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుజరాత్ పంచాయతీ మహా సమ్మేళన్‌లో (Gujarat Panchayat Mahasammelan) పాల్గొని ప్రసంగిస్తారు. గుజరాత్ రాష్ట్రం 33 జిల్లా పంచాయతీలు, 248 తాలూకా పంచాయతీలు, 14,500 పైగా గ్రామ పంచాయతీలతో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను కలిగి వుంది. గుజరాత్ పంచాయతీ మహా సమ్మేళన్‌లో లక్షమందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. మార్చి 12వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్‌యూ) (Rashtriya Raksha University) భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోడీ. సాయంత్రం 6.30 గంటలకు 11వ ఖేల్ మహాకుంభ్‌ను ప్రారంభించి ప్రసంగిస్తారు.
ఇక రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం విషయానికి వస్తే.. పోలీసులు, న్యాయవ్యవస్థ వంటి వివిధ విభాగాలలో శిక్షణ పొందిన మానవ వనరుల అవసరాన్ని తీర్చడానికి ఏర్పాటు చేశారు. 2010లలో గుజరాత్ ప్రభుత్వం స్థాపించిన రక్షా శక్తి యూనివర్సిటీని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం పేరుతో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ విశ్వవిద్యాలయం అక్టోబర్ 1, 2020 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.
పోలీసు సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ లా అండ్ జస్టిస్, సైబర్ సైకాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, స్ట్రాటజిక్ లాంగ్వేజ్‌లు, అంతర్గత రక్షణ, అంతర్గత భద్రతలో డిప్లొమా నుండి డాక్టరేట్ స్థాయి వరకు అకడమిక్ ప్రోగ్రామ్‌లను RRU అందిస్తుంది. వ్యూహాలు, శారీరక విద్య, క్రీడలు, తీర, సముద్ర భద్రత వంటి అంశాలలో 18 రాష్ట్రాల నుండి 822 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్నారు. 2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నేటి ప్రధాని నరేంద్రమోడీ దార్శనికతతో 16 క్రీడలు, 13 లక్షల మంది పాల్గొనే ఖేల్ మహాకుంభ్ (Khel Mahakumbh) ఈరోజు 36 సాధారణ క్రీడలు, 26 పారా క్రీడలను కలిగి వుంది. 11వ ఖేల్ మహాకుంభ్ కోసం 45 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి గమనార్హం. శుక్రవారం నాడు ఒక భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించనున్నారు. అంతేకాదు మూడు రోజుల ఆరెస్సెస్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనబోతున్నారు. 2017లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారాన్ని అందుకున్నప్పటికీ.. అనుకున్న మెజార్టీని సాధించలేకపోయింది. 182 సీట్లు ఉన్న అసెంబ్లీలో 150 సీట్లను గెలవాలని భావించినప్పటికీ.. బీజేపీ కేవలం 99 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో పుంజుకుని 77 సీట్లను కైవసం చేసుకుంది.