రేపటితో ఆపరేషన్ గంగ సమాప్తం! రేపు సాయంత్రం ఇండియాకు చివరి ఫ్లైట్

Published : Mar 09, 2022, 08:16 PM ISTUpdated : Mar 09, 2022, 08:19 PM IST
రేపటితో ఆపరేషన్ గంగ సమాప్తం! రేపు సాయంత్రం ఇండియాకు చివరి ఫ్లైట్

సారాంశం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ గంగ రేపటికి సమాప్తం కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రేపు సాయంత్రం ఉక్రెయిన్ సరిహద్దు దేశం నుంచి చివరి ఫ్లైట్ ఇండియాకు బయల్దేరుతుందని వివరించాయి. ఈ చివరి ఫ్లైట్‌లో భారతీయుల తరలింపునకు సహకరించడానికి అక్కడకు బయల్దేరిన ప్రభుత్వ బృందాలు తిరిగి రానున్నాయి.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రష్యా దాడులు మొదలు కాగానే.. ఉక్రెయిన్ ప్రభుత్వం ఆ దేశ గగన తలాన్ని మూసేసింది. దీంతో ఉక్రెయిన్‌ నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగానే భారత ప్రభుత్వం పౌరులను ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు రప్పించి.. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల్లో స్వదేశానికి తెస్తున్నది. ఈ ఆపరేషన్ గంగ రేపటితో సమాప్తం కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆ దేశం నుంచి స్వదేశానికి తరలించే ఆపరేషన్ గంగను కేంద్ర ప్రభుత్వం రేపటితో ముగించనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్ గంగలో భాగంగా చివరి విమానం రేపు సాయంత్రం టేకాఫ్ కానున్నట్టు వివరించాయి. ఈ చివరి విమానంలో తరలింపునకు సహాయపడటానికి అక్కడికి పంపిన ప్రభుత్వ బృందాలు వస్తాయని పేర్కొన్నాయి. గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా ప్రభుత్వం దాడులు ప్రారంభించగానే కేంద్రం ఈ తరలింపు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 18వేల మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించింది. ఇందులో చాలా వరకు విద్యార్థులే ఉన్నారు.

ఉక్రెయిన్‌ నుంచి చివరి బ్యాచ్ విద్యార్థులను రేపు భారత్‌కు రానున్నారు. ఉక్రెయిన్ నగరం సుమీలో చిక్కుకున్న సుమారు 700 మంది భారత విద్యార్థులు పశ్చిమ ఉక్రెయిన్‌ వైపు ట్రైన్‌లో బయల్దేరారు. వారు అక్కడకు చేరగానే సరిహద్దుకు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేపు భారత్‌కు చేరనున్నారు.

ఆపరేషన్ గంగ ముగియనున్న తరుణంలో రొమేనియాలోని భారత ఎంబసీ కీలక ట్వీట్ చేసింది. రొమేనియా నుంచి సుమారు 8000 మంది భారతీయులను తరలించినట్టు పేర్కొంది. చివరి ప్రత్యేక విమానం బుకారెస్ట్ నుంచి ఈ రోజు ఇండియాకు బయల్దేరుతుందని మార్చి 9వ తేదీ మధ్యామ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ట్వీట్ చేసింది. ఈ సహాయం చేసిన రొమేనియా ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.

ఆపరేషన్ గంగ ఫిబ్రవరి 22వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌లో చిక్కుకుని సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన విద్యార్థులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. రష్యా సైనిక చర్యతో ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసి వేయడంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిందని ఆయన చెప్పారు. భారత పౌరుల్ని పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్‌ వంటి దేశాల సరిహద్దుల నుంచి సురక్షితంగా తీసుకొచ్చిందని యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ఇతర దేశాలు తమ పౌరుల్ని అక్కడే వదిలేస్తే.. భారత్‌ మాత్రం విద్యార్థులు, పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించిందన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) రొమేనియా, హంగరి, పోలండ్‌ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని... అందువల్లే ఎక్కడా ఎలాంటి సమస్యా ఎదురవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆయా దేశాల సరిహద్దుల్లో భారతీయులకు దక్కిన సదుపాయాలు మరే ఇతర దేశాల విద్యార్థులకూ దక్కలేదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన వెంటనే భారతీయుల్ని వెంటనే రప్పించేందుకు మోదీ సమీక్ష నిర్వహించారని యోగి గుర్తుచేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?