
ఉక్రెయిన్ రష్యా యుద్ధం (russia Ukraine war) నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తరలిస్తోన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గంగా (operation ganga) అనే మిషన్ ద్వారా ఎయిరిండియా (air india), వాయుసేన (indian airforce) విమానాలను రంగంలోకి దించి విద్యార్ధులను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గంగా ద్వారా రాష్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) ముచ్చటించారు. రష్యా యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి ఒక్క భారతదేశం మాత్రమే తమ పౌరుల్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుని సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన విద్యార్థులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. రష్యా సైనిక చర్యతో ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ గగనతలాన్ని మూసి వేయడంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిందని ఆయన చెప్పారు. భారత పౌరుల్ని పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్ వంటి దేశాల సరిహద్దుల నుంచి సురక్షితంగా తీసుకొచ్చిందని యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ఇతర దేశాలు తమ పౌరుల్ని అక్కడే వదిలేస్తే.. భారత్ మాత్రం విద్యార్థులు, పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) రొమేనియా, హంగరి, పోలండ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని... అందువల్లే ఎక్కడా ఎలాంటి సమస్యా ఎదురవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆయా దేశాల సరిహద్దుల్లో భారతీయులకు దక్కిన సదుపాయాలు మరే ఇతర దేశాల విద్యార్థులకూ దక్కలేదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన వెంటనే భారతీయుల్ని వెంటనే రప్పించేందుకు మోదీ సమీక్ష నిర్వహించారని యోగి గుర్తుచేశారు.
యూపీ ప్రభుత్వం కూడా విద్యార్థుల వివరాలను సేకరించి నోడల్ అధికారుల్ని నియమించిందని.. ప్రధాని నరేంద్ర మోదీ నలుగురు కేంద్ర మంత్రుల్ని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపారని యూపీ సీఎం వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మొత్తంగా 2290 మంది యూపీ విద్యార్థులు ఉండగా.. ఇప్పటివరకు 2078 మందిని తీసుకొచ్చామని చెప్పారు. మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని సీఎం పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌కు చెందినవారు 74మంది ఉండగా.. 70 మందిని భారత్‌కు తరలించామని, మిగతా నలుగురిని కూడా తీసుకొస్తున్నాం అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.