కర్ణాటక ఎన్నికలు : బెంగళూరులో ప్రధాని మెగా రోడ్ షో.. మోడీపై పూల వర్షం కురిపించిన జనం

Siva Kodati |  
Published : Apr 29, 2023, 09:57 PM IST
కర్ణాటక ఎన్నికలు : బెంగళూరులో ప్రధాని మెగా రోడ్ షో.. మోడీపై పూల వర్షం కురిపించిన జనం

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి మోడీ.. మోడీ అనే నినాదాలతో మారుమోగించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో మెగా రోడ్ షో నిర్వహించారు. ఉత్తర బెంగళూరులో జరిగిన ఈ  రోడ్ షోకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దారి పొడవునా నిలబడ్డ జనం.. మోడీ మోడీ నినాదాలతో మారు మోగించారు. రాష్ట్రంలో మూడో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లా కుడచి నుంచి ప్రధాని మోడీ బెంగళూరులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో ఆయన ప్రయాణించారు. కాషాయ టోపీ ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ ముందుకు సాగారు. ఆయన వెంట బెంగళూరు నార్త్ ఎంపీ డీవీ సదానంద గౌడ, ఎమ్మెల్సీ సీ నారాయణ స్వామి వున్నారు. ఈ సందర్భంగా మోడీపై జనం పూలవర్షం కురిపించారు. 

 

 

రహదారులు మొత్తం కాషాయమయం అయిపోగా.. కళాకారులు రోడ్డుపై కళారూపాలను ప్రదర్శించారు. ప్రఖ్యాత డ్రమ్ డ్యాన్స్ ‘డొల్లు కుణిత’ను ప్రదర్శించారు. మొత్తం 5.3 కిలోమీటర్ల పొడవైన రోడ్ షో ఉత్తర బెంగళూరులోని మగాడి రోడ్, నైస్ రోడ్ జంక్షన్‌ మీదుగా సుమనహళ్లి వరకు సాగింది. మోడీ రోడ్ షో కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రధాని కాన్వాయ్ వెళ్లే కొన్ని రహదారులపైకి రావొద్దని పోలీసులు అంతకుముందే ప్రజలకు సూచించారు. ప్రధాని మోడీ రోడ్ షో వెళ్లే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. 

మోడీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీదర్ చేరుకున్నారు. అనంతరం హుమ్నాబాద్, విజయపుర , బెళగావి జిల్లా కుడచిలో జరిగిన బహిరంగ సభల్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. రోడ్ షో తర్వాత శనివారం రాత్రి బెంగళూరులోని రాజ్‌భవన్‌లో బస చేసి ఆదివారం ఉదయం కోలార్, రామనగర జిల్లాల్లోని చెన్నపట్టణ.. హాసన్ జిల్లాలోని బేలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు మోడీ. ఢిల్లీకి తిరిగి వెళ్లేముందు ఆదివారం మైసూర్‌లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడించనున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu