
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని మోడీని “విష పాము” తో పోల్చడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఖర్గే వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ప్రధాని మోదీని శివుడితో (నీలకంఠడు) పోల్చిన శివరాజ్ సింగ్ .. ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం విషం తాగుతున్నారని అన్నారు.
ప్రధాని ..సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నారనీ పేర్కోన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందనీ, అందుకే ప్రధాని మోదీపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పురాణాల ప్రకారం.. 'నీల్' అంటే నీలం మరియు 'కాంత్' అంటే గొంతు. క్షీరసాగర మథనంలో సముద్రం నుంచి ఉద్భవించిన విషాన్ని శివుడు సేవించి తన గొంతులో పెట్టుకున్నందున నీలకంఠుడు అని పేరు పెట్టారు.
కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన ఓ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ విషసర్పం లాంటి వాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ.. 'మోదీ విషసర్పం లాంటివాడు. ఎవరైనా అతడిని ముట్టుకోవాలని చూస్తే.. మరణం తధ్యం' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాను ప్రధానిని వ్యక్తిగతంగా దూషించలేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం విషంతో సమానం అని వ్యాఖ్యానించానని ఖర్గే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.