ప్రధాని నరేంద్ర మోడీ పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ముందే .. ఆయన కులాన్ని అక్టోబర్ 27, 1999న ఓబీసీగా ప్రకటించినట్లుగా పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఒడిషాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మోడీ కులం గురించి అబద్ధం చెప్పారని, ఆయన పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదన్నారు.
ప్రధాని.. గుజరాత్‌లోని ‘‘ తెలి ’’ కులంలో జన్మించారని.. దీనిని 2000వ సంవత్సరంలో దీనిని ప్రభుత్వం జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ కుటుంబంలో జన్మించలేదు కాబట్టే ప్రధాని మోడీ.. తన జీవితాంతం కులగణనను అంగీకరించరని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే ఆ వెంటనే రాహుల్ తన వ్యాఖ్యలను సవరించారు. మోడీ ‘‘తెలి’’లో కాదని.. ‘‘ఘాంచీ’’ కులంలో పుట్టారని రాహుల్ దుయ్యబట్టారు.
అయితే రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో నరేంద్ర మోడీ కులాన్ని ఓబీసీలో చేర్చడంపై మరోసారి వివాదం రాజుకుంది. ఇదే సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ముందే .. ఆయన కులాన్ని అక్టోబర్ 27, 1999న ఓబీసీగా ప్రకటించినట్లుగా పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.