
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగళూరులో 26 కి.మీ మేర మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు. నగరంలోని పలు ప్రాంతాల గుండా ఈ రోడ్ షో సాగనుంది. రోడ్ షో నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. బెంగళూరు, బీజేపీ మధ్య పాత, బలమైన బంధం ఉందని చెప్పారు. బీజేపీకి తొలినాళ్ల నుంచి బెంగళూరు నగరం మద్దతిస్తూనే ఉందని పేర్కొన్నారు. బెంగళూరు అభివృద్దికి తాము అనేక ప్రయత్నాలు కూడా చేశామని తెలిపారు.
‘‘మేము మా ట్రాక్ రికార్డ్‌తో పాటు ఇప్పటివరకు సాధించిన విజయాలను మరింత పెంచుకుంటామని వాగ్దానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ఆధారంగా బెంగళూరు ప్రజల దీవెనలు కోరుతున్నాము. కర్ణాటకను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడంతోపాటు బెంగళూరు అభివృద్ధి పథంలో అసమానమైన ఊపును అందించడం మా ప్రయత్నం. హెల్త్‌కేర్, హౌసింగ్, పారిశుధ్యం.. ఇలా ప్రతిదానిలో బెంగళూరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇది చాలా మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దారితీసింది.
ఈజ్ ఆఫ్ లివింగ్‌కు సంబంధించి ముఖ్యమైన అంశం సరైన రవాణా మౌలిక సదుపాయాలు కల్పించడం. మా ప్రభుత్వం మెరుగైన కనెక్టివిటీ కోసం భవిష్యత్ ప్రాజెక్టులను అందించింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా, మెరుగైన రహదారులు, మరింత సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థలు, అత్యుత్తమ నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం మేము అత్యధిక ప్రాధాన్యతను కొనసాగిస్తాము.
అది సాంకేతికత లేదా రవాణా కావచ్చు.. ప్రజల అంచనాలకు అనుగుణంగా సాంకేతికత, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా బెంగళూరు స్థానాన్ని పునరుద్ఘాటించే మార్గదర్శక పరిష్కారాలపై మేము కృషి చేస్తాము. మా పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, మరింత అభివృద్ధి చుట్టూ తిరుగుతుంది. మేము సామాజిక న్యాయ అవసరాలకు సున్నితంగా ఉంటాము. భవిష్యత్తు కోసం మాకు ఖచ్చితమైన దృష్టి ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను కూడా మోదీ షేర్ చేశారు.