పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద గతేడాది నవంబర్‌లో 15వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక 16వ విడత డబ్బులు ఫిబ్రవరి చివరి వారంలో పడనున్నాయి. అయితే.. అంతకుముందే ఫిబ్రవరి 20వ తేదీన ఈకేవైసీ గడువు ముగుస్తున్నది.
PM Kisan: నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా ఎకరాకి ఏడాదికి రూ. 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు సార్లు రూ. 2000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ డబ్బులు పడుతున్నాయి. చివరి సారి గతేడాది నవంబర్ 15వ తేదీన ఈ డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 16వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు అందించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రైతులు రైతు బంధు పథకం కింద వచ్చే డబ్బులతోపాటు మోడీ ప్రభుత్వం వేసే డబ్బుల కోసమూ ఎదురుచూస్తుంటారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 16వ విడత డబ్బులు ఈ నెలలో పడనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిసింది. ఈ డబ్బులు రావాలంటే.. రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి.
Also Read: బీజేపీతో పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘మల్కాజ్‌గిరి టికెట్ భద్రమే’
ఈకేవైసీకి గడువు కూడా ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. కాబట్టి, ఇంతలోపే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే.. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో మోడీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. ఈ స్కీం కింద డబ్బులు పొందాలంటే.. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.