
Airplane crash in Ahmedabad : 242 మంది ఉన్న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్‌లో కూలింది. లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI 171, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెఘనినగర్ ప్రాంతంలోని ఫోరెన్సిక్ క్రాస్ రోడ్ వద్ద కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు, వీరిలో ఇద్దరు పైలట్లు, పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
విమానాన్ని కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ నడిపించారు. విమానం రన్‌వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేడే (MAYDAY) కాల్ ఇచ్చింది. ఆ తరువాత ఏటీసీ (ATC) నుంచి సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించారు. పౌరవిమానయానశాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించాలని ఆదేశించారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్, అధికారులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. పౌరవిమానయానశాఖ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందిస్తూ, "సహాయక చర్యలకు మద్దతు ఇస్తాం, బాధిత కుటుంబాలకు అన్నివిధాలా సహాయం అందిస్తాం" అని ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేసి, సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.
విమాన ప్రమాదం చోటు చేసుకున్న IGB గ్రౌండ్ పరిసరాల్లో భారీగా పొగలు ఎగిసిపడిన దృశ్యాలు కనిపించాయి. స్థానికులు బలమైన పేలుడు శబ్దాన్ని విన్నట్టు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసు విభాగం, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అలాగే, జాతీయ విపత్తుల స్పందనా దళం (NDRF) బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రాణ నష్టం వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడి, కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను సహాయక చర్యలకు అడ్డుకాబడకుండా ప్రమాద ప్రాంతానికి రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రమాదంపై పౌరవిమానయానశాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ దుర్ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. మేము అప్రమత్తతతో ఉన్నాము. అన్ని విమాన, అత్యవసర విభాగాలు సమన్వయంగా చర్యలు తీసుకుంటున్నాయి” అని ఆయన X (ట్విట్టర్)లో పేర్కొన్నారు. రక్షణ బృందాలను మొబిలైజ్ చేశామని, వైద్య సహాయం, సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 గంటలకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం, కొద్దిసేపటికే ఏటీసీకి ‘మేడే’ కాల్ పంపింది. ప్రధాన పైలట్ సుమిత్ సభర్వాల్‌కు 8200 గంటల అనుభవం ఉండగా, కోపైలట్‌కు 1100 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉందని సమాచారం. ఏటీసీ తిరిగి సంప్రదించేందుకు ప్రయత్నించినా, స్పందన లేకపోవడం ఆందోళన కలిగించింది. తక్కువ సమయంలోనే విమానం కూలిపోయింది.