
Chenab Railway Bridge : భారత ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ తో ఉద్రిక్తతల తర్వాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో అత్యంత కీలకమైనది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినా రైల్వే బ్రిడ్జ్.
జమ్మూ కాశ్మీర్ లో ప్రవహించే చీనాబ్ నదిపై ఈ రైల్వే వంతెనను నిర్మించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. అత్యంత క్లిష్ట ప్రాంతంలో కఠిన పరిస్థితులను అధిగమించి ఈ ప్రాజెక్టును పూర్తిచేసారు. దీంతో తొలిసారిగా కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం జరిగింది.
నది మట్టం నుండి 359 మీటర్లు అంటే ప్రాన్స్ లోని ఈపిల్ టవర్ కంటే ఎత్తైనది ఈ రైల్వే బ్రిడ్జ్. 1,315 మీటర్ల పొడవైన ఈ స్టీల్ వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై విస్తరించి ఉంది. కత్రా-సంగల్దాన్ రైలు మార్గంలో ఇది కీలకమైన లింక్. వంతెనపై జాతీయ జెండాను ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు మోదీ.
ఉధంపూర్‌లోని వైమానిక దళ స్టేషన్‌లో దిగిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనవద్దకు చేరుకున్నారు మోదీ. ముందుగా హెలికాప్టర్ లో నుండే ఈ వంతెనను పరిశీలించారు. అనంతరం వంతెన వద్దకు చేరుకున్న ఆయన జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు.
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుండి శ్రీనగర్ మధ్య ప్రయాణించే రెండు వందే భారత్ రైళ్లను కూడా మోడీ ప్రారంభించారు. ఈ రైళ్లు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇలా ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన వంతెనను, యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌ను దేశానికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
చీనాబ్ వంతెనతో పాటు భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనను (అంజి) కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. 272 కి.మీ. పొడవైన యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌ను ఆయన దేశానికి అంకితం చేశారు. రూ. 43,780 కోట్ల వ్యయంతో పూర్తైన ఈ భారీ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకతలు కలిగివుంది. అవేంటో చూద్దాం.
ప్రారంభోత్సవ వేదిక వద్ద యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న కార్మికులు, ఇంజనీర్లతో ప్రధాని మోడీ సంభాషించారు. ఆయనతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, MoS జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు.
చీనాబ్ వంతెన, యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్ పూర్తయిన నేపథ్యంలో కాశ్మీర్ లో పర్యాటకం పెరుగుతుందని… తద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. కాశ్మీర్ లోయ, భారతదేశం మధ్య ప్రయాణం, సరుకుల రవాణా ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింత సులభతరం అవుతుందని చెబుతున్నారు.