తమిళనాడులో రాజ్ భవన్ వద్ద పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబును రాజ్ భవన్ గేటు పైకి విసిరారు. మరో బాంబు విసిరేసే లోపు భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్ భవన్ వద్ద పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి పెట్రోల్ బాంబును రాజ్ భవన్ గేటు వైపు విసిరేశాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. మరికొన్ని పెట్రోల్ బాంబులను విసిరేయడానికి ముందే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారిక నివాసం వద్ద ఈ పెట్రోల్ బాంబులు విసిరేసిన ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.
ఈ ఘటన మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబులు విసిరేసిన నిందితుడు కరుకా వినోత్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, సైదాపేట్ కోర్టు వద్ద పార్కింగ్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ సేకరించిన వినోత్ రాజ్ భవన్ వైపు నడిచాడు. అక్కడ ఆ పెట్రోల్‌ను రెండు బాటిళ్లలో పోశాడు. వాటికి నిప్పు అంటించి ఒకదానిని రాజ్ భవన్ మెయిన్ గేటు పైకి విసిరారు. వెంటనే భద్రతా సిబ్బంది వినోత్‌ను అడ్డుకున్నారు. మరో పెట్రోల్ బాంబు విసరకుండా అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడ మోహరించారు.
2022లో వినోత్ చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరేసిన కేసులో మూడు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు.
Also Read: నేను రాజకీయాల కోసం రాలేదు.. నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని.. : భువనేశ్వరి
ఈ ఘటన పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమళై స్పందిస్తూ అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ పైకి ఈ రోజు పెట్రోల్ బాంబ్ విసిరారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇలా ఉన్నదని వివరించారు. కానీ, డీఎంకే మాత్రం ప్రజల దృష్టి మరల్చే పనిలో ఉన్నదని ఆరోపించారు.
ఈ ఘటనను గవర్నర్ ఆర్ఎన్ రవి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఘటన గురించి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వివరాలు అడిగారు. భద్రతా పరమైన విషయాలను అడిగినట్టు సమాచారం.